తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Pegasus News: పెగసస్ వ్యవహారంపై వచ్చేవారం సుప్రీం విచారణ - బెగాసస్ హ్యాకింగ్ అప్డేట్స్​

supreme court
పెగసస్ వ్యవహారంపై వచ్చేవారం సుప్రీం విచారణ

By

Published : Jul 30, 2021, 11:01 AM IST

Updated : Jul 30, 2021, 11:37 AM IST

10:57 July 30

పెగసస్ వ్యవహారంపై వచ్చేవారం సుప్రీం విచారణ

జాతీయ స్థాయిలో రాజకీయ దుమారానికి కారణమైన పెగసస్ నిఘా వ్యవహారంపై(Pegasus Snooping) వచ్చే వారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రముఖ పాత్రికేయులు ఎన్​. రామ్, శశి కుమార్ మంగళవారం ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఉదయం న్యాయవాది కపిల్ సిబల్.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఈ పిటిషన్​ను ప్రస్తావించారు. పెగసస్ వ్యవహారంతో(Pegasus News) కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని వివరించారు. సిబల్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. వచ్చే వారం వాదనలు వింటామని స్పష్టం చేసింది. 

పిటిషన్​లో ఏముంది?

సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి ద్వారా పెగసస్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని సీనియర్ పాత్రికేయులు ఎన్ రామ్, శశి కుమార్​.. దేశ అత్యున్నత ధర్మాసనాన్ని కోరారు. ఏ విధమైన నిఘా కోసమైనా పెగసస్ స్పైవేర్​ను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉపయోగించారా అన్న విషయంపై సమాధానం చెప్పేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ సాఫ్ట్​వేర్ లైసెన్సు ప్రభుత్వం వద్ద ఉందా అన్న విషయంపై స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టులు, న్యాయవాదులు, మంత్రులు, విపక్ష నేతలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా మొత్తం 142 మంది భారతీయులు పెగసస్ లక్షిత జాబితాలో ఉన్నట్లు పలు పత్రికలు చేపట్టిన విచారణలో తేలిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇందులో కొందరి ఫోన్లు హ్యాక్​ అయినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు. ఇలా చేయడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు.

"మిలిటరీ గ్రేడ్ స్పైవేర్​ను ఉపయోగించి నిఘా పెట్టడం ఆమోదయోగ్యం కాదు. ఇది గోప్యత హక్కుకు విరుద్ధం. ఇలా చేయడం ఒకరి జీవితంలోని వ్యక్తిగత అంశాల్లోకి చొరబడటమే. మంత్రులు, సీనియర్ రాజకీయ నేతల ఫోన్లు హ్యాక్ చేసి.. నిందితులు సైబర్ టెర్రరిజానికి పాల్పడ్డారు. కీలకమైన సమాచారాన్ని లక్ష్యంగా చేసుకున్నారు."

-పిటిషనర్లు

పెగసస్ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు, సిట్ విచారణ జరిపించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Last Updated : Jul 30, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details