సీబీఎస్ఈ(CBSE) 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా 12వ తరగతి పరీక్షల రద్దుకు సీబీఎస్ఈ(CBSE), సీఐఎస్‌సీఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 31వ తేదీ(సోమవారం)కి వాయిదా వేసింది. పిటిషన్ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని పిటిషన్దారును ఆదేశించింది.
సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను జూన్ 1న ఖరారు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. అయితే సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి పరీక్షలపై విద్యాశాఖ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు సుప్రీం తీర్పుతో రాష్ట్రాల బోర్డులు కూడా 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.