Savarkar bird : "వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అండమాన్ సెల్యూలర్ జైలులో బంధించారు. ఆయన ఉన్న గదికి ఒక చిన్న రంధ్రం కూడా ఉండేది కాదు. కానీ ఆ గదికి బుల్బుల్ పిట్టలు వచ్చేవి. సావర్కర్ వాటి రెక్కలపై కూర్చుని రోజూ తన మాతృభూమికి వెళ్లి వచ్చేవారు".. కర్ణాటకలో 8వ తరగతి విద్యార్థుల పాఠం ఇది. ఆశ్చర్యంగా ఉందా? అందుకే ఇది నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ సంగతి..పాఠ్యపుస్తకాల పునఃసమీక్షకు కొంతకాలం క్రితం ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం. రోహిత్ చక్రతీర్థ కమిటీ ఈ ఏడాది ఆ బాధ్యతలు చేపట్టింది. 8వ తరగతి కన్నడ టెక్స్ట్ బుక్‌లో గతంలో విజయమాల రాసిన "బ్లడ్ గ్రూప్" అనే పాఠం తీసేసి, "కాలవాను గెడ్డవారు"(కాలాన్ని గెలిచినవారు) పేరిట సరికొత్త పాఠం ప్రవేశపెట్టింది. స్వయంగా అండమాన్ సెల్యూలర్ జైలును చూసొచ్చిన కేకే గట్టి.. తన అనుభవాలను వివరిస్తూ రాసిన పాఠం అది.