Satyapal malik on central government: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. కేంద్రం.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆదివారం హరియాణా నూహ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాపై దాడి చేసిన సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
"కేంద్రం మూడు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. కొందరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. భాజపాలో విచారించాల్సిన వ్యక్తులు లేరా? నేను పది మంది పేర్లను ఇస్తాను. వారందరిపైనా విచారణ చేయండి. అవసరమైతే నాపైన కూడా విచారణ జరిపించండి."
-సత్యపాల్ మాలిక్, మేఘాలయ గవర్నర్