Satya Pal Malik Attacks PM Modi: అధికారంలో ఉన్న పార్టీకి చెందిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. నిత్యం కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనలపై చర్చించిన సమావేశంలో ప్రధాని చాలా అహంకారిగా ప్రవర్తించారని అన్నారు. తాను మోదీతో వాగ్వాదానికి దిగినట్లు చెప్పుకొచ్చారు. హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ మేరకు మాట్లాడారు. ఆ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
రైతుల సమస్యలపై చర్చించినప్పుడు ఐదు నిమిషాల పాటు ప్రధానితో వాగ్వాదం జరిగింది. 500 మంది రైతులు మరణించారని ప్రశ్నించినప్పుడు.. మోదీ చాలా అహంకారిగా స్పందించారు. 'నా కోసం చనిపోయారా?' అని అన్నారు. మీరు ప్రధానిగా ఉన్నప్పుడు చనిపోయారని నేను చెప్పాను.
-సత్యపాల్ మాలిక్, మేఘాలయ గవర్నర్
పోరాటం ఆగిందనుకుంటే పొరపాటే:
satya pal malik news: సాగు చట్టాల పోరాటంలో రైతులపై నమోదైన కేసులను రద్దు చేసే విషయంలో కేంద్రం నిజాయితీగా వ్యవహరించాలని మాలిక్ కోరారు. ఎంఎస్పీకి చట్టబద్ధమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. 'రైతు పోరాటం ఆగిపోయిందని ప్రభుత్వం అనుకుంటే పొరపాటే. తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయింది. ఏదైనా అన్యాయం జరిగితే మళ్లీ నేను మొదలుపెడతాను' అని మాలిక్ హెచ్చరించారు.