రంగుల పండుగ హోలీని ఇష్టపడని వారుండరు. అయితే.. బీహార్లోని ముగేర్ జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సతీస్థాన్ గ్రామ ప్రజలు 200 ఏళ్లుగా హోలీ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఇతర గ్రామాలకు చెందిన వారు ఆనందంతో హోలీలో మునిగి తేలుతుంటే ఆ గ్రామ ప్రజలు హోలీకి ఆమడదూరంగా పరిగెడతారు. 1500 మందికి పైగా ఉన్న వారంతా హోలీకి దూరంగా ఉండటానికి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.
భర్తతో పాటే..
గ్రామానికి చెందిన వ్యక్తి హోలీ రోజే మరణిస్తాడు. దీంతో కుంగిపోయిన అతని భార్య.. ఆయనతో పాటే చితిలో సజీవదహనం చేయాలని కోరుతుంది. ఎంత వారించినా మాట వినకుండా భర్తతో పాటే సతీసహగమనం చేయాలని ప్రాధేయపడుతుంది. దీంతో ఆమెను ఇంట్లో బంధించి భర్త శవాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతారు బంధువులు. పాడెను మోసేందుకు ప్రయత్నించిన ప్రతీసారీ శవం కింద పడుతుండటం గమనించి ఆశ్చర్యపోతారు. చివరకు భార్యను బయటకు తీసుకురాగానే.. ఆమె చేతివేలు నుంచి అగ్ని బయటకు వచ్చి భార్యాభర్తలిద్దరూ మంటల్లో కాలిపోయారని ప్రచారంలో ఉన్న కథను గ్రామంలోని చాలా మంది విశ్వసిస్తుంటారు.