దేశంలో లక్ష, అంతకు మించి జనాభా ఉన్న పట్టణాల్లో డిస్కంలు 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్తు శాఖ నిర్దేశించింది. తాత్కాలిక అవసరాలకు ఎవరైనా కరెంటు కనెక్షన్‌కు దరఖాస్తు చేస్తే 48 గంటల్లోగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు విద్యుత్ వినియోగదారుల హక్కుల నియమావళి-2020కి సవరణ చేస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. కొన్ని కొత్త నిబంధనలను ఇందులో చేర్చింది. వీటిని తక్షణం అమల్లోకి తెస్తూ ప్రతి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఆదేశాలివ్వాలని స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం..: లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో కాలుష్యం తగ్గించేందుకు డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని నియంత్రించాలి. ఇది జరగాలంటే పట్టణాల్లో కరెంటు నిరంతర సరఫరాకు డిస్కంలు చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇలాంటి పట్టణాల్లో ఏదైనా ఒక ప్రాంతంలో కరెంటు సరఫరా నిలిపివేయాల్సి వస్తే ఎంత సమయం ఆపాలో రాష్ట్ర ఈఆర్‌సీ నిర్ణయించాలి. అలాగే సరఫరా నిలిపివేతకు సగటు సమయాలను ఈఆర్‌సీ నిర్ణయిస్తే వాటిని డిస్కంలు పాటించాలి.ఏదైనా ఒక ప్రాంతంలో కరెంటు పోతే 3 నిమిషాలలోపు పునరుద్ధరించాలి. అప్పుడే నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నట్టుగా భావించాలి.