JNU WOMAN VC: దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్(59) నియమితులయ్యారు. ఇదివరకు ఉపకులపతిగా ఉన్న జగదీశ్ కుమార్ ఇటీవలే యూజీసీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. దాంతో కేంద్ర విద్యాశాఖ శాంతిశ్రీని ఈ పదవికి నామినేట్ చేసింది. యూనివర్సిటీ విజిటర్‌గా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దానికి ఆమోద ముద్ర వేశారు. తద్వారా యూనివర్సిటీ మొదటి మహిళా వైస్ ఛాన్సలర్‌గా శాంతిశ్రీ ఎంపికయ్యారు. ఆమె ఈ పదవిలో ఐదు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.
'సరస్వతీ' కుటుంబం..!
Santishree Dhulipudi Pandit: శాంతిశ్రీ జులై 15, 1962లో రష్యాలో జన్మించారు. ఆమె తండ్రి డా ధూళిపూడి ఆంజనేయులు జర్నలిస్ట్‌గా, రచయితగా సేవలందించడమే కాకుండా సివిల్ సర్వెంట్‌గా రిటైర్ అయ్యారు. ఆమె తల్లి ఆదిలక్ష్మి తెలుగు, తమిళ ప్రొఫెసర్‌గా సేవలందించారు. పలు దేశాల్లో డిగ్రీలు సంపాదించిన శాంతిశ్రీ బహుభాషా కోవిదురాలు. ఆమెకు తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టుంది. అంతేకాకుండా కన్నడం, మలయాళం, కొంకణి భాషలను అర్థం చేసుకోగలరు. గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, యలవర్రులో ఆంజనేయులు జన్మించారు.
చదువుల రాణి..
- శాంతిశ్రీ 1983లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి బి.ఏ. (చరిత్ర, సోషల్ సైకాలజీ) విభాగంలో తొలి డిగ్రీ సంపాదించారు. 1985లో అదే కాలేజీలో పొలిటికల్ సైన్స్ విభాగంలో ఎం.ఏ. పూర్తి చేశారు.
- ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉపకులపతిగా ఎంపికైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఆమె పూర్వ విద్యార్థి. 1990లో శాంతిశ్రీ ఆ యూనివర్సిటీలో ఎంఫిల్‌తో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ క్రమంలో 'నెహ్రూ సమయంలో భారతదేశంలోని పార్లమెంట్, విదేశాంగ విధానం'పై థీసిస్ రాశారు.
- 1996లో స్వీడన్‌లోని ఉప్సలా యూనివర్సిటీ నుంచి శాంతి, సంఘర్షణలో పోస్ట్ డాక్టొరల్ డిప్లొమా, అలాగే అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి సామాజిక సేవా విభాగంలో డిప్లొమా చేశారు.