Sanjay Raut press conference: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. మహా వికాస్ అఘాడీ నేతలు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అరోపించారు. ముంబయి దాదర్లో ఉన్న సేన భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఇలాంటి వ్యూహాలకు అఘాడీ లొంగిపోదని అన్నారు.
Sanjay Raut on BJP:
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబ సభ్యులపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తననూ లొంగదీసుకోవాలని చూశారని చెప్పుకొచ్చారు.
"20 రోజుల క్రితం కొందరు సీనియర్ భాజపా నేతలు నన్ను కలిశారు. వారికి విధేయంగా ఉండాలని సూచించారు. ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని అనుకుంటున్నామని చెప్పారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే 'పరిస్థితిని చక్కబెడతాయ'ని వారు చెప్పారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంబంధీకుల ఇళ్లపై జరిగిన ఈడీ దాడులను ప్రస్తావించారు. నేను వారికి మద్దతు ఇవ్వనని తెగేసి చెప్పా. అప్పటి నుంచి నాకు తెలిసిన వారిని టార్గెట్ చేస్తున్నారు."