తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా ప్రభుత్వాన్ని కూల్చమన్నారు'.. వెంకయ్యకు రౌత్ లేఖ - మహారాష్ట్ర సంజయ్​ రౌత్​

Sanjay Raut News: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు తనను సంప్రదించారని తెలిపారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్​. లేకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించారని ఆరోపించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.

Sanjay Raut letter
'మహా ప్రభుత్వాన్ని కూల్చమన్నారు' వెంకయ్యకు రౌత్ లేఖ

By

Published : Feb 9, 2022, 1:35 PM IST

Sanjay Raut letter: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని తమ మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు తనను సంప్రదించారని పేర్కొన్నారు. తమకు సహకరించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని బెదరించారని తెలిపారు. అయితే తాను అలాంటి వాటికి భయపడే వ్యక్తిని కాదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాసినట్లు వెల్లడించారు.

కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎన్​ఫోర్స్​ డైరెక్టరేట్​ను కొందరిపై దురుద్దేశపూర్వకంగా ఉపయోగిస్తున్నారని వెంకయ్యకు రాసిన లేఖలో రౌత్​ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక ఈవిషయంపై వెంకయ్య బహిరంగంగా మాట్లాడాలన్నారు.

"నెల రోజుల క్రితం నన్ను కొందరు సంప్రదించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించమన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చేందుకు నన్ను ఒక పావుగా వాడుకుందామనుకున్నారు. అయితే అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పా. సహకరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు బెదిరించారు. నాతో పాటు మరో ఇద్దరు సీనియర్ మంత్రులను మనీలాండరింగ్​ కేసు పెట్టి జైలుకు పంపిస్తామన్నారు. రైల్వే మాజీ మంత్రికి ఏ గతి పట్టిందో గుర్తు చేసుకోవాలన్నారు. నేను మాత్రం ఎవరికీ తలవంచను."

-సంజయ్ రౌత్​, శివసేన ఎంపీ

మనీలాండరింగ్ చట్టం 2003 జనవరిలో వచ్చిందని, అంతకుముందు జరిగిన లావాదేవీలకు అది వర్తించదని రౌత్ అన్నారు. 17 ఏళ్ల క్రితం తన కుటుంబానికి భూమిని విక్రయించిన వారిని ఈడీ బెదిరిస్తోందని, తనకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. భాజపాకు వ్యతిరేకంగా ఉన్న వారిని కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని, ఈడీలో కొందరు అధికారులు ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని రౌత్ అన్నారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'సమతామూర్తి మేడిన్​ చైనా! ఆత్మనిర్భర్ భారత్​ అంటే ఇదేనా?'

ABOUT THE AUTHOR

...view details