తనకు దొరికిన 100 గ్రాముల బంగారాన్ని సంబంధిత వ్యక్తులకు అప్పగించి తన నిజాయతీని నిరూపించుకుంది ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.
ఇదీ జరిగింది..
అన్నమలయ్ నగర్‌కు చెందిన గణేశ్ రామనన్ ఇటీవల 100 గ్రాముల బంగారపు నాణాన్ని కొనుగోలు చేశాడు. ఆ నాణాన్ని అతని నివాసంలో మంచం కింద ఓ కవర్లో పెట్టి దాచాడు. ఈ విషయం తెలియని అతని భార్య ఆ కవర్‌ను చెత్త బుట్టలో పారవేసింది.
సోమవారం నాడు చెత్తను సేకరిస్తున్న క్రమంలో మేరీకి బంగారపు నాణెం ఉన్న పాలిథిన్ కవర్ లభించింది. తొలుత ఆ కవర్లో ఏదో ఇనుప వస్తువు ఉందని భావించిన మేరీ.. దానిని తెరిచి చూడగా అందులో బంగారు నాణెం ఉంది. వెంటనే ఆ నాణాన్ని స్థానిక పోలీసులకు అప్పగించింది.
బంగారం కనిపించకపోవడంపై అప్పటికే ఠాణాలో రామనన్ ఫిర్యాదు చేయడం వల్ల.. పోలీసులు వివరాలు తెలుసుకుని ఆ బంగారాన్ని అతనికి అప్పగించారు. ఈ సందర్భంగా మేరీ నిజాయతీని అందరూ ప్రశంసించారు.
ఇదీ చూడండి :పరారీలోని నిందితునికి బెయిల్ వద్దు: సుప్రీం