తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ పాపం ఎవరిది.. కలకలం రేపుతున్న ఇసుక వ్యాపారి ఆత్మహత్య - ఆంధ్రప్రదేశ్​ ఇసుక రీచ్​

Sand Trader Suicide: కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్‌రాజు ఆత్మహత్య కలకలం రేపుతోంది. అడ్డగోలుగా ఇసుక దందా సాగిస్తున్న వాళ్ల ఒత్తిడే బలవన్మరణానికి కారణమని భావిస్తున్నారు. వ్యాపారంలో భాగంగా నెలకు 21 కోట్ల చొప్పున చెల్లించలేక తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వ్యాపారం నుంచి తప్పించడంతో మానసిక వేదనకు లోనయ్యారని.. ఆత్మహత్యకు అదే కారణమని సన్నిహితులు, మిత్రులు చెబుతున్నారు.

Sand Trader Suicide
ఇసుక వ్యాపారి ఆత్మహత్య

By

Published : Mar 20, 2023, 6:49 AM IST

Updated : Mar 20, 2023, 9:53 AM IST

ఈ పాపం ఎవరిది.. కలకలం రేపుతున్న ఇసుక వ్యాపారి ఆత్మహత్య

Sand Trader Suicide in East Godavari District: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్‌రాజు ఆత్మహత్య సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై సన్నిహితుల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక అంశాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నప్పటికీ.. ఇసుక వ్యాపారంలో ప్రవేశించేవరకూ ప్రేమ్‌రాజుకు అలాంటి సమస్యలేమీ లేవన్నది మిత్రుల మాట. ఇసుక దందాలో చక్రం తిప్పుతున్నవారు నిర్దేశించిన నెలవారీ భారీ మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో వ్యాపారం నుంచి తప్పించారని అంటున్నారు. దానివల్ల ప్రేమ్‌రాజు తీవ్ర ఒత్తిడికి, మానసిక వేదనకు గురైనట్లు చెబుతున్నారు.

ఎవరిది ఈ పాపం : సున్నిత మనస్కుడైన ప్రేమ్‌రాజు ఇసుక వ్యాపారంలో తగిలిన వరుస దెబ్బలతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారన్న అభిప్రాయం సన్నిహితుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ పాపం ఇసుక దందాలో చక్రం తిప్పుతున్నవారిదేనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాక.. ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రేమ్‌రాజు చాలా కాలం పనిచేశారని సన్నిహితులు చెబుతున్నారు. టర్న్‌కీ సంస్థ ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక ఇన్‌ఛార్జిని నియమించి.. ఇసుక తవ్వకాలు, విక్రయాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జిగా ప్రేమ్‌రాజు పనిచేశారు.

టర్న్‌కీ సంస్థను 2022 ఆగస్టులో ఇసుక వ్యాపారం నుంచి తప్పించారు. ప్రతి జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అనధికారిక ఉపగుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు. రీచ్‌ల వారీగా ఇసుక వ్యాపారాన్ని స్థానిక నేతలకు అప్పగించి వాళ్ల వద్ద కొంత డిపాజిట్‌ తీసుకున్నారు. దీనికితోడు నెలవారీ చెల్లించాల్సిన మొత్తాన్నీ నిర్ణయించారు. అప్పటికే ఇసుక వ్యాపారంలో అనుభవం ఉన్న ప్రేమ్‌రాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వ్యాపారానికి ముందుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న పెద్దలకు డిపాజిట్‌గా 25 కోట్లు చెల్లించినట్టు సన్నిహితులు చెబుతున్నారు.

ప్రతి నెలా 21 కోట్ల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్టు వ్యాపారులు, రవాణాదారులు గుర్తు చేస్తున్నారు. ఇసుక వ్యాపారం ఆశించిన విధంగా జరగక నెలకు సగటున 8 నుంచి 9 కోట్ల రూపాయల చొప్పున మూడు నెలలు నష్టపోయిన ప్రేమ్‌రాజు నెలకు 21 కోట్ల చొప్పున చెల్లించలేకపోయారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఇసుక వ్యాపారం నుంచి తప్పించారని.. 25 కోట్ల డిపాజిట్‌ మొత్తాన్ని కూడా వెనక్కి ఇవ్వలేదని సమాచారం. మిత్రులు, సన్నిహితుల వద్ద నిధులు సమీకరించి వ్యాపారంలో పెట్టానని, తనను కొనసాగించాలని బతిమాలుకున్నా కనికరించకపోవడంతో ప్రేమ్‌రాజు తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సన్నిహితులు చెబుతున్నారు.

వాస్తవాలను కప్పిపుచ్చుతున్న గనుల శాఖ : పేరుకు జేపీ సంస్థ ప్రధాన గుత్తేదారు అయినా ఉమ్మడి కడప జిల్లాలో ఓ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సోదరుడు, అనంతపురం జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరికి ఆనుకొని ఉండే ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుయాయులు, రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఓ రవాణాదారు, ఆ జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక వ్యాపారంలో కొందరు నేతలు, వ్యాపారులు భాగస్వాములు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ ఎమ్మెల్యే బావమరిది ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం చేసి, కొన్ని రోజుల క్రితం ఇతరులకు అప్పగించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్థాయిలో ఇసుక దందా జరుగుతున్నా, గనులశాఖ వాస్తవాలను కప్పిపుచ్చుతోంది. ఇసుక తవ్వకాలు, విక్రయాలు పారదర్శకంగా సాగుతున్నట్లు చెబుతోంది. జిల్లా స్థాయిలో గత సెప్టెంబర్ నుంచి ఇసుక వ్యాపారం అప్పగించిన నాయకులు.. నెలకింత మొత్తం చెల్లించాలని లక్ష్యం నిర్దేశించినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో 21 కోట్లు, తూర్పుగోదావరిలో 25 కోట్లు, కృష్ణాలో 21 కోట్లు, గుంటూరులో 18 కోట్లు, నెల్లూరులో 17 కోట్లు, కడపలో 16 కోట్ల ధర ఖరారు చేశారని అంటున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Mar 20, 2023, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details