India Russia Defence sector: రష్యాపై అమెరికా సహా నాటో దేశాలు విధించిన కఠిన ఆంక్షల ప్రభావం భారత రక్షణ రంగంపై పెద్దగా ఉండదని నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ మాజీ ఛీప్ వీకే సారస్వత్ వెల్లడించారు. రష్యాకు స్వాభావికమైన సైనిక బలం ఉందని, రక్షణ ఉత్పత్తుల్లో ఆ దేశం స్వయం సమృద్ధి సాధించిందని అన్నారు. వారి వద్ద రిజర్వ్‌లు కూడా ఎక్కువగానే ఉంటాయన్నారు. ప్రస్తుతం భారత్ 68 శాతం రక్షణ సామగ్రిని దేశీయంగానే తయారు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. 2022-23 బడ్జెట్‌లో ఆ దిశగా అడుగులు పడ్డాయని, సైనిక బలగాల కోసం రక్షణ సామగ్రి దేశీయంగానే తయారవుతుందని తెలిపారు. మోదీ ఆత్మనిర్భర్ భారత్ రక్షణ రంగానికి కూడా వర్తిస్తోందన్నారు.
Sanctions on Russia will effect India?
గత ఏడాది మార్చిలో విడుదలైన సిప్రీ నివేదిక ప్రకారం 2011-15తో పోలిస్తే 2016-20లో భారత రక్షణ రంగ దిగుమతులు 33 శాతం తగ్గాయి. రష్యాపై ఎక్కువగా ఆధారపడటాన్ని భారత్ క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. గత కొన్నేళ్లుగా దేశీయంగా రక్షణ పరిశ్రమ అభివృద్ధికి భారత్ అనేక చర్యలు చేపట్టింది. సీఆర్ఎస్ నివేదిక ప్రకారం ఆయుధాలు, సైనిక సామగ్రి విషయంలో భారత్... రష్యాపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకుంది. అయితే రష్యా సరఫరా చేసిన రక్షణ సామగ్రి వాడకుండా భారత సైన్యం పూర్తి సామర్థ్యంతో పని చేయలేదు. ఇంకా కొంతకాలం వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.