Sanatana Dharma Row : సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలుదేశవ్యాప్తంగా ఇంకా రాజకీయ ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో మరో డీఎంకే నేత, ఎంపీ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తూ సనాతన ధర్మాన్ని సామాజిక వ్యాధులతో పోల్చారు.
DMK MP On Sanatana Dharma : "మంచి హిందువు.. సముద్రం దాటి పరాయి దేశానికి వెళ్లకూడదు. మీ (మోదీ) పని ఎప్పుడూ ఎక్కడెక్కడికో వెళ్లడమే" అంటూ మోదీ విదేశీ పర్యటనలపై రాజా వ్యాఖ్యానించారు. మోదీ సనాతన ధర్మ సూత్రాలను ఉల్లంఘించారని ఆరోపణలు చేశారు. శంకరాచార్యుల సమక్షంలో దిల్లీలో సనాతన ధర్మంపై చర్చకు రావాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. దేశ రాజధానిలో ఈ చర్చకు తేదీని నిర్ణయించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలకు డిమాండ్ చేశారు.
'విపక్ష కూటమి హిందూఫోబియా ప్రతిబింబిస్తోంది'
BJP On Sanatana Dharma Row :ఇండియా కూటమి మానసికంగా దివాలా చెందిందని బీజేపీ ఆరోపించింది. డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలు.. హిందూఫోబియాను ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. డీఎంకే నేత చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఘాటుగా స్పందించారు. "ఈసారి సనాతన ధర్మం గురించి చేసిన డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలు.. దారుణమైనవి. ప్రతిపక్షాల 'ఇండియా' కూటమిని చుట్టుముట్టిన మానసిక దివాలాతోపాటు లోతుగా పాతుకుపోయిన హిందూఫోబియాను ఆ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి" అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్తో పాటు వారి స్నేహితులు.. భారతదేశ మూలాలను ఎలా దూషిస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. సనాతనమే శాశ్వతమైనదని, అదే సత్యమని తెలిపారు.
డీఎంకేపై అన్నామలై ఫైర్..
సనాతనను డెంగ్యూ, మలేరియాతో పోల్చడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. డీఎంకేలో D అంటే డెంగ్యూ, M అంటే మలేరియా, K అంటే దోమ అని ఆ పార్టీని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం చేపట్టిన ఐదేళ్లలో తొలి ఏడాది సనాతనను వ్యతిరేకించారని, రెండో ఏడాది సనాతనను రద్దు చేయాలన్నారనీ మూడో ఏడాది నిర్మూలించాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 4-5 ఏడాదిల్లో మళ్లీ తాము హిందువులమే అని చెప్పుకుంటారనీ దశాబ్దాలుగా డీఎంకే ఇదే చేస్తుందని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు వారు అమర్, అక్బర్, ఆంథోనీలాగా అవతారం ఎత్తుతారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదే వ్యూహంతో 17 ఏళ్లుగా అపజయం పాలవుతున్నారని విమర్శించారు.
'విపక్షాల మౌనమెందుకు?'
సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మౌనాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రశ్నించారు. ఎంతమంది స్టాలిన్లు వచ్చినా.. సనాతన ధర్మాన్ని నిర్మూలించలేరని వ్యాఖ్యానించారు. హిందుత్వానికి వ్యతిరేకంగాగా ఇండియా కూటమి పార్టీలు ఒక్కటయ్యారని ఆయన ఆరోపించారు. వారి అసలు స్వరూపాలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపణలు చేశారు.
అన్ని మతాలను సమానంగా గౌరవించాలి: కాంగ్రెస్
అయితే డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, రాజా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలతో తమ పార్టీ పూర్తిగా విభేదిస్తున్నట్లు పేర్కొంది. అన్ని మతాలను సమానంగా గౌరవించాలని తమ పార్టీ విశ్వసిస్తుందని తెలిపింది. ఇండియా కూటమిలోని ప్రతి సభ్యుడికి అన్ని విశ్వాసాలు, నమ్మకాలు, సంఘాలపై అపారమైన గౌరవం ఉన్నట్లు హస్తం పార్టీ పేర్కొంది. సనాతన ధర్మాన్ని ఉద్దేశించిన డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, రాజా చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. తమ పార్టీకి అన్ని మతాలపై సమానమైన గౌరవం ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా తెలిపారు. ఏ ఒక్కరు కూడా ఒక మతం కంటే మరొకటి తక్కువ అని భావించరాదని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలను రాజ్యాంగం కానీ, జాతీయ కాంగ్రెస్ కానీ అనుమతించవని పవన్ ఖేడా స్పష్టం చేశారు.
'పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశాలివ్వండి'
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశించాలని దిల్లీకి చెందిన న్యాయవాది సుప్రీంకోర్టుకు అభ్యర్థించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోనందుకు గాను దిల్లీ, చెన్నై పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు.
'నేనేం అలా వ్యాఖ్యలు చేయలేదు'
మరోవైపు, హిందూమతాన్ని ఉద్దేశించి తాను కించపరిచే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కర్ణాటక హోంమంత్రి జీ.పరమేశ్వర తెలిపారు. "మనమంతా హిందువులే. ఉదయం నిద్రలేవగానే గణపతిని స్మరించుకుంటాను. ఆ తర్వాత లక్ష్మీ శ్లోకం చదువుతాను. రోజూ నిద్రపోతున్నప్పుడు హనుమాన్ శ్లోకం చదువుతాను. బీజేపీ వాళ్లకు ఈ శ్లోకాలేం రావు. ఎవరికైనా వస్తే ఓ సారి చెబుతారా?" అంటూ సవాల్ విసిరారు. అయితే ఉపాధ్యాయ దినోత్సవం రోజు.. ఆయన ఓ పాఠశాలలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. "దేశంలో బౌద్ధ, జైన మతాలు పుట్టిన చరిత్ర ఉందన్నారు. అయితే హిందూ మతం ఎప్పుడు పుట్టింది? ఎవరు సృష్టించారు?" అని పరమేశ్వర వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్షం బీజేపీ తీవ్రస్థాయిలో పరమేశ్వరపై మండిపడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన వివరణ ఇచ్చారు.