Sanatana Dharma Remark Row :సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు సహా మొత్తం 262 మంది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన స్టాలిన్.. కనీసం క్షమాపణ చేప్పేందుకు కూడా ఒప్పుకోలేదని ఆరోపించారు లేఖలో సంతకం చేసిన దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా.
Sanatana Dharma Supreme Court : దేశ లౌకిక స్వభావాన్ని కాపాడేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయా ప్రముఖులంతా ప్రధాన న్యాయమూర్తిని కోరారు. అతి తీవ్రమైన అంశాల్లో చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తే.. అది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని లేఖలో పేర్కొన్నారు. స్టాలిన్‌పై చర్యలు తీసుకోవడంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. న్యాయాన్ని కాపాడేందుకు తమ అభ్యర్థనను స్వీకరిస్తారని ఆశిస్తున్నట్లు అందులో చెప్పారు.
స్టాలిన్ హిట్లర్‌తో పోల్చిన బీజేపీ
Stalin On Sanatana Dharma Bjp Reaction : మరోవైపు స్టాలిన్‌ను జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చింది బీజేపీ. భారత్‌లో సనాతన ధర్మాన్ని పాటించే 80 శాతం జనాభాకు వ్యతిరేకంగా మాట్లాడి.. మారణహోమానికి పిలుపునిచ్చారని దుయ్యబట్టింది. అలాంటి వారికి కాంగ్రెస్, ఇండియా కూటమి మద్దతు తెలుపుతోందని మండిపడింది. హిట్లర్ యూదులను ఎలా ఊచకోత కోయాలని చెప్పారో.. అచ్చం అలాగే స్టాలిన్ సనాతన ధర్మంపై వ్యాఖ్యానించారని విమర్శించింది.