Sanatan Dharma Row Supreme Court : సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా ముగ్గురు ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమ వాదన ఏంటో తెలియజేయాలని తమిళనాడు సర్కార్‌ను, ఉదయనిధిని ఆదేశించింది.
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశాలని ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో జగన్నాథ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అనుచిత వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు అనేక సార్లు కలగజేసుకుని ఆదేశాలు జారీ చేసిందని.. మంత్రి ఉదయనిధిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉదయనిధితో పాటు తమిళనాడు సర్కార్, ఎంపీలు ఏ రాజా, తిరుమావళవన్, వెంకటేశన్, తమిళనాడు డీజీపీ, గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబుకు కూడా జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
అంతకుముందు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఈ మతం మంచిది కాదని.. మరో మతం మంచిదని చెప్పాలని పాఠశాల విద్యార్థులను మంత్రి కోరారని ఆరోపించారు. 'వ్యక్తులు వేరొకరి మతవిశ్వాసానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు కోర్టు దృష్టికి వచ్చాయి. ఈ సారి స్వయంగా ఓ మంత్రి.. విద్యార్థుల ఎదుట ఓ మతం మంచిదని కాదని చెప్పారు' అని శేషాద్రి నాయుడు అన్నారు.
న్యాయస్థానం నుంచి మీరు ఏమి కోరుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడిని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రి ఉదయనిధి అటువంటి ప్రకటనలు చేయకుండా నిరోధించాలని.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నానని శేషాద్రి నాయుడు బదులిచ్చారు. 'మేం నోటీసులు జారీ చేస్తున్నాం.. ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా మీరు న్యాయస్థానాన్ని పోలీస్‌స్టేషన్‌గా మారుస్తున్నారు. మీరు హైకోర్టుకు వెళ్లి ఉండాల్సింది' అని ధర్మాసనం పేర్కొంది. సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మంత్రిగా ఉన్నందు వల్ల ఎవరూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని.. అందుకే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు న్యాయవాది.