వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు.. వర్షాకాల సమావేశాలు జరిగే పార్లమెంట్ భవనం ముందు ధర్నా చేస్తామని తెలిపారు. దాదాపు 200 మంది ప్రతిరోజు నిరసన తెలపనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) ఆదివారం వెల్లడించింది. సభలో ఆందోళన చేయాలని విపక్ష సభ్యులకు హెచ్చరికలు జారీ చేస్తూ జులై 17న లేఖలు పంపిస్తామని ఎస్కేఎమ్ తెలిపింది. సమావేశాలు ముగిసేవరకు రైతులకు మద్దతు తెలపాలని కోరనున్నట్లు వెల్లడించింది. జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి.
"మేము హౌస్ బయట ఆందోళన చేపడతాం. లోపల సభ్యులకు మా డిమాండ్లు వినిపించేలా చేస్తాం. విపక్ష ఎంపీలు పార్లమెంట్ లోపల ప్రతిరోజూ కొత్త సాగు చట్టాల అంశాన్ని లేవనెత్తాలని కోరతాం. మా సమస్యలు వారు వినేదాక పోరాడతాం. సెషన్ బయటకు వచ్చి కేంద్రానికి మేలు చేయకూడదని చెబుతాం. మా సమస్యలకు పరిష్కారం ఇవ్వకుండా సమావేశాలను విజయవంతం చేయకూడదు. ప్రతీ రైతు సంఘం నుంచి కనీసం ఐదుగురు సభ్యుల చొప్పున ఆందోళనల్లో పాల్గొంటాం."
- బల్బీర్ సింగ్ రాజేవాలా, రైతు నాయకుడు
దేశవ్యాప్తంగా నిరసన..
దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా జులై 8న ఆందోళన చేపట్టాలని ఎస్కేఎమ్ పిలుపునిచ్చింది. డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ ధరలు ఆకాశన్నంటుతున్నందున.. జాతీయ రహదారులపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలను నిలిపి ఉంచాలని కోరింది.
"మీ దగ్గర ఏ వాహనం ఉంటే.. ఆ వాహనాన్ని హైవే పై ఉంచండి. ట్రాక్టర్, ట్రాలీ, స్కూటర్, కార్ ఐదైనా.. దగ్గరలోని జాతీయ రహదారిపైకి తీసుకురండి. కానీ ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేయవద్దు. మధ్యాహ్నం 12 గంటలకు ఎనిమిది నిమిషాల పాటు వాహనాల హారన్లను మోగించండి. ఎల్పీజీ సిలిండర్లను కూడా రహదారులపైకి తీసుకురండి. దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసన ప్రదర్శనలో పాలుపంచుకోండి."
- బల్బీర్ సింగ్ రాజేవాలా, రైతు నాయకుడు