Samudrayaan Matsya 6000 : జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి పరిశోధనలకు పంపిన 'చంద్రయాన్-3' విజయంతో ఊపుమీదున్న భారత్.. త్వరలో 'సముద్రయాన్'కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి మత్స్య-6000.. తుది మెరుగులు దిద్దుకుంటోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
పర్యావరణానికి నో ముప్పు
Samudrayaan Project Matsya 6000 :"తదుపరి ప్రయాణం.. 'సముద్రయాన్'. ఇది చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో నిర్మితమవుతున్న మత్స్య-6000 జలాంతర్గామి. భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్‌లో భాగంగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చుని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు. దాంతో సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చు. ఈ వ్యవస్థ సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలిగించదు" అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. జలాంతర్గామిలో కూర్చుని పరిశీలించిన కిరణ్ రిజిజుకు దాని విశేషాల గురించి నిపుణులు వివరించారు.
ఆరు వేల మీటర్ల లోతు వరకు..
Samudrayaan Mission India : 'సముద్రయాన్' నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రారంభమైతే భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కనుంది. ఆక్వానాట్‌లను ఆరు వేల మీటర్ల లోతు వరకు తీసుకెళ్లేందుకు గోళాకార నౌకను నిర్మించనున్నారు. తొలుత ఇది 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు సమాచారం.