స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు సంబంధించిన కేసు విచారణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను భాగం చేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ విషయంలో అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏప్రిల్ 18న లేఖలు రాసినట్లు ధర్మాసనానికి సమర్పించిన తాజా అఫిడవిట్లో పేర్కొంది. వివాహ వ్యవస్థకు సంబంధించి చట్టాలు చేసే బాధ్యతల గురించి రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్రాలను ఇందులో భాగం చేయాలని పేర్కొంది.
"ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలి. వారికి ఈ విషయంలో చట్టాలు చేసే హక్కు ఉంది. దీనిపై తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఆ హక్కులను ప్రభావితం చేస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిపై చట్టాలు చేశాయి. కాబట్టి వారిని ప్రస్తుత కేసులో భాగం చేయడం చాలా అవసరం. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ఆయా ప్రాంతాలు, వర్గాలలో ఉన్న ఆచారాలు, పద్ధతులు, నిబంధనలను గమనించాలి. వారి అభిప్రాయాలు లేకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా స్వలింగ వివాహాల చట్టబద్ధత ప్రక్రియను అసంపూర్తిగా మారుస్తుంది. సమర్థవంతమైన తీర్పు కోసం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోర్టు ముందు ఉంచడం చాలా ముఖ్యం."
-సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్