రానున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కార్యాచరణ ప్రారంభించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నేరాలు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా గురువారం ఆయన 'సైకిల్ యాత్ర' నిర్వహించారు. ప్రముఖ సామాజిక నేత జ్ఞానేశ్వర్ మిశ్రా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తాలుకా స్థాయిలో ఈ సైకిల్ యాత్రలకు సమాజ్వాదీ పార్టీ పిలుపునిచ్చింది. లఖ్నవూలో ఈ యాత్ర ప్రారంభించేముందు తమ పార్టీ వచ్చే ఏడాది ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తుందని అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు.
"నేను మా పార్టీ 350 సీట్లు గెలుస్తుందని చెబుతూ వచ్చాను. కానీ, ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని బట్టి చూస్తే.. మేము తప్పకుండా 400 సీట్లు గెలుస్తామని చెప్పగలం. కరోనా రెండో దశలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. ఆక్సిజన్, మందులు అందించకుండా వారు చనిపోవడానికి కారణమైంది."
-అఖిలేశ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో.. నేరాలను భాజపా ప్రోత్సహిస్తోందని అఖిలేశ్ ఆరోపించారు. "2017 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను భాజపా ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇప్పుడు 'మనీ ఫెస్టో'ను రూపొందిస్తోంది. ఎస్పీ హయాంలో చేపట్టిన పాత ప్రాజెక్టులకు పేరు మార్చడం తప్పిస్తే.. నాలుగేళ్లుగా భాజపా చేసిందేమీ లేదు" అని విమర్శించారు.