Mulayam Singh Yadav Health : సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. హరియాణా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి ఐసీయూలో ములాయం చికిత్స పొందుతున్నారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి మెరుగుపడడం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ములాయం సింగ్.. యూరిన్ ఇన్ఫెక్షన్, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్‌ను సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించాయి.
ములాయం త్వరగా కోలుకోవాలని ఎస్పీ కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. మరోవైపు ములాయం కుటుంబ సభ్యులు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి చేరుకున్నట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎస్పీ అగ్రనేత అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ములాయం త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం.. ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.