సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోలీసులు ఇచ్చిన టీని నిరాకరించారు. దానిలో విషం ఉండొచ్చని అనుమానించారు. ఆదివారం ఉదయం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది ఆయనకు ఛాయ్ అందించగా.. దానిలో విషం ఉండొచ్చని తిరస్కరించారు. అనంతరం తన మనిషి బయట నుంచి తెచ్చిన టీ తాగుతానని చెప్పారు.
పోలీసులు ఇచ్చిన 'టీ'ని తిరస్కరించిన అఖిలేశ్.. విషం కలిపారన్న అనుమానం! - పోలీసులు ఇచ్చిన టీని తిరస్కరించిన అఖిలేశ్ యాదవ్
పార్టీ నేత అరెస్టును నిరసిస్తూ.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ ఆదివారం లఖ్‌నవూలో ఆందోళనకు దిగారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చాయ్ తాగేందుకు ఆహ్వానించగా, ఆయన నిరాకరించారు. చాయ్ పేరుతో విషం ఇస్తే? అంటూ ప్రశ్నించారు.
సోషల్‌మీడియాలో అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులు చేశారనే ఆరోపణలతో.. సమాజ్‌వాదీ పార్టీ ఆఫీస్ బేరర్ మనీశ్ జగన్ అగర్వాల్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అగర్వాల్ అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలేశ్ యాదవ్.. తన కార్యకర్తలతో పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది అఖిలేశ్‌కు టీ అందించగా.. "ఇక్కడి టీ నేను తాగను.. బయటి నుంచి తెచ్చిన టీ తాగుతాను.. విషం కలిపితే ఎలా?" అని దాన్ని తిరస్కరించారు. అనంతరం తన వెంట వచ్చిన ఒకరిని బయట ఏమైనా టీ దుకాణం ఉంటే అక్కడ నుంచి తీసుకురమ్మని పంపించారు.
"నేను పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్నప్పటికీ.. లోపల ఏ సీనీయర్ అధికారి లేరు. హెడ్‌క్వార్టర్స్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. మరి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి" అని అఖిలేశ్ అన్నారు. అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలపై లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ ప్రశాంత్ కుమార్ స్పందించారు. "ఆదివారం కావడం వల్ల అధికారులు అవసరాన్ని బట్టి హాజరయ్యారని.. వారితో నేను మాట్లాడాను. ఇక్కడ ఉన్న అధికారులు అతనికి టీ అందించారు. అతను టీ తాగాడు" అని ఆయన వెల్లడించారు.