తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాముడితో రాహుల్ గాంధీకి పోలిక.. సల్మాన్​ వ్యాఖ్యలపై భాజపా ఫైర్ - bharat jodo yatra salman khurshid

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్.. రాముడితో పోల్చడంపై భాజపా మండిపడింది. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని ధ్వజమెత్తింది. ఇందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఖుర్షీద్.

rahul-gandhi-lord-ram compare
rahul-gandhi-lord-ram compare

By

Published : Dec 27, 2022, 7:02 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోలుస్తూ ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అధికార భాజపా.. సల్మాన్ వ్యాఖ్యలపై మండిపడింది. అవినీతి కేసులో బెయిల్​పై బయట తిరుగుతున్న వ్యక్తిని, కోట్లాది మంది కొలిచే భగవంతుడితో పోల్చడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించింది. అయితే, భాజపా నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. సల్మాన్ ఖుర్షీద్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు.

అసలేం జరిగిందంటే?
ఉత్తర్​ప్రదేశ్​లో భారత్ జోడో యాత్ర కోఆర్డినేటర్​గా ఉన్న ఖుర్షీద్.. సోమవారం మొరాదాబాద్​లో విలేకరులతో మాట్లాడుతో రాహుల్ గాంధీని రాముడితో పోల్చారు. యూపీలో రాహుల్ గాంధీ నేరుగా యాత్ర చేపట్టకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు.

సల్మాన్ ఖుర్షీద్ ప్రెస్ మీట్

"రాహుల్ గాంధీ మానవాతీతుడు. చలికి మనమంతా వణుకుతూ జాకెట్లు వేసుకుంటే.. ఆయన మాత్రం టీషర్టు వేసుకొని యాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ ఓ యోగి. తపస్సు చేసిన విధంగా పూర్తి నిష్ఠతో రాజకీయం చేస్తున్నానని ఆయనే చెప్పారు. కొన్నిసార్లు రాముడి పాదుకలు దేశమంతా తిరుగుతాయి. రాముడు వెళ్లలేని ప్రాంతాలకు ఆయన పాదుకలను భరతుడు తీసుకెళ్లేవారు. అదేవిధంగా మేము పాదుకలను ఉత్తర్​ప్రదేశ్​కు తీసుకొచ్చాం. పాదుకలు వచ్చాయి కాబట్టి రాముడు సైతం వస్తారని మా నమ్మకం."
-సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ సీనియర్ నేత

భాజపా ఫైర్
ఖుర్షీద్ వ్యాఖ్యలపై భాజపా నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ నేతలకు దైవభక్తి, దేశభక్తి కన్నా.. కుటుంబ భక్తి ఎక్కువగా ఉందని ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఖుర్షీద్ క్షమాపణలు చెప్పాలని భాజపా ప్రతినిధి షెహజాద్ పూనావాలా డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాముడి ఉనికినే ప్రశ్నించింది. హిందువుల మనోభావాలను ఎప్పటికప్పుడు దెబ్బతీసింది. రాహుల్​ను రాముడితో పోల్చిన సల్మాన్ ఖుర్షీద్.. ఇతర మతాల విషయంలోనూ ఇలా చేయగలరా?' అంటూ పూనావాలా ప్రశ్నించారు. "ప్రపంచం అంతా అనుసరించే మహాపురుషుడితో రాహుల్ గాంధీని పోల్చే ముందు సల్మాన్ ఖుర్షీద్ వెయ్యి సార్లు ఆలోచించుకోవాలి. ఖుర్షీద్ బారిస్టర్ చదువుకున్నారు. కానీ ఆయన వ్యాఖ్యలు వ్యక్తుల ఆరాధనను సూచిస్తున్నాయి" అని మరో భాజపా నేత శ్రీవాస్తవ పేర్కొన్నారు.

'ఎలా పొగడమంటారు?'
అయితే, భాజపా విమర్శలను సల్మాన్ ఖుర్షీద్ కొట్టిపారేశారు. 'దేవుడు చూపించిన మార్గాన్ని ఓ వ్యక్తి అనుసరిస్తున్నారని నేను నమ్ముతున్నా. అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తిని ఎలా పొగడాలి? భగవంతుడికి ఎవరూ ప్రత్యామ్నాయం కాదు. కానీ దేవుడు చూపిన దారిలో ఎవరైనా నడవొచ్చు. అలాంటివారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పటివరకు భాజపా మంచి వ్యక్తులను చూడలేదు. అది వారి సమస్య' అని భాజపాపై ఎదురుదాడికి దిగారు.

ABOUT THE AUTHOR

...view details