తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ మెచ్చిన 'సల్మాన్' కథ.. అందరికీ ఆదర్శం​

పని చేయగలిగే శక్తి ఉండి కూడా.. ఇతరులపై ఆధారపడి కడుపు నింపుకుంటారు కొందరు. కానీ, ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి​ కాళ్లల్లో సత్తువ లేకపోయినా.. సొంతంగా జీవిస్తున్నాడు. తన లాంటి వారెందరికో బతుకుబాట చూపుతున్నాడు. అందుకే.. ప్రధాని నరేంద్రమోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకీ అతనెవరు? ఏం చేశాడు?

By

Published : Jan 8, 2021, 6:39 AM IST

Salman: An inspiring story for many in Uttar Pradesh
మోదీ మెచ్చిన 'సల్మాన్' కథ.. అందరికీ ఆదర్శం​

మోదీ మెచ్చిన 'సల్మాన్' కథ.. అందరికీ ఆదర్శం​

సంకల్పం ముందు వైకల్యం ఏ మాత్రం అడ్డు కాదని నిరూపించాడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సల్మాన్​. పుట్టుకతోనే దివ్యాంగుడైన అతడు.. సొంతంగా ఓ ప్యాక్టరీని స్థాపించి తన లాంటి వారెందరికో ఉపాధి కల్పిస్తున్నాడు. అతడి​ కృషిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా మెచ్చుకున్నారు.

ఏం చేశాడు..?

సల్మాన్​ది... మొరాదాబాద్​కు 22 కి.మీల దూరంలోని హమీర్​పుర్​. పుట్టుక నుంచి అతడి రెండు కాళ్లూ పని చేయవు. ఉద్యోగం కోసం పదో తరగతి పాసవ్వాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ.. ఆశ నెరవేరలేదు. ఈ క్రమంలో తానే ఎందుకు సొంతంగా ఓ పరిశ్రమ స్థాపించకూడదు? అనుకున్నాడు సల్మాన్​.

సల్మాన్​ ఫ్యాక్టరీలో డిటర్జెంట్​ పౌడర్​ తయారు చేస్తున్న దివ్యాంగుడు

ఆ తర్వాత రూ.5 లక్షల పెట్టుబడితో.. ఓ అద్దె భవనంలో చెప్పులు, డిటర్జెంట్ పౌడర్​ తయారీ చేసే ఓ ఫ్యాక్టరీని నెలకొల్పాడు. దివ్యాంగులను మాత్రమే తన కంపెనీలో చేర్చుకుని... 'టార్గెట్' బ్రాండ్​​ పేరుతో ఈ వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నాడు.

"నా దగ్గర ప్రస్తుతం 55 మంది పని చేస్తున్నారు. అందరూ దివ్యాంగులే. వారంతా రోజుకు రూ.500 సంపాదించగులుగుతున్నారు. ఎన్ని ఉత్పత్తులను అమ్మితే వారు అంత సంపాదించగలుగుతారు. ప్రధాని మోదీ నా గురించి ప్రస్తావించిన తర్వాత మా కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు బాగా పెరిగాయి."

-- సల్మాన్​, దివ్యాంగుడు.

మార్కెటింగ్​ కూడా వారే..

సల్మాన్​ ఫ్యాక్టరీలో ఉపాధి పొందుతున్న దివ్యాంగులు

సల్మాన్​ ఫ్యాక్టరీలో షిఫ్టుల వారీగా ఈ దివ్యాంగులంతా పని చేస్తారు. వారంతా రోజూ 150 జతల చెప్పులు, డిటర్జెంట్​ పౌడర్​ను తయారు చేస్తారు. వీటి అమ్మకాల విషయంలోనూ వారే ముందుండి నడిపిస్తారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ.. ఉత్పత్తులను విక్రయిస్తారు. ఒక్క మొరాదాబాద్​ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన దివ్యాంగులు కూడా సల్మాన్​ వద్ద ఇప్పుడు ఉపాధి పొందుతున్నారు.

'ఇది నా ఒక్కడి విజయం కాదు'

సల్మాన్​ కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది 'మన్​కీ బాత్'​లో ప్రస్తావించారు. తన ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దీటుగా ఎదుర్కొని విజయపథంలో దూసుకెళ్తున్నానని సల్మాన్​ చెబుతున్నాడు. అయితే.. ఈ విజయం తను ఒక్కడిదే కాదని అంటాడతడు. కుటుంబ సభ్యుల సహకారం అందించడం వల్లే.. రూ.5 లక్షలు లోన్​ తీసుకుని ఈ ఫ్యాక్టరీ స్థాపించానని అతడు గుర్తు చేసుకుంటాడు.

తన కంపెనీలో తయారైన చెప్పులను ఒక్కో జత రూ.100కు, చిన్న డిటర్జెంట్​ ప్యాకెట్​ను రూ.10కి సల్మాన్​ అమ్ముతున్నాడు. తన పరిశ్రమను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లి.. 100 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అతడు అడుగులు వేస్తున్నాడు.

ఇదీ చూడండి:హాకీలో దేశానికి 27 పతకాలు తెచ్చిపెట్టింది ఆ ఊరే

ABOUT THE AUTHOR

...view details