Headmaster stopped salary: పాఠశాల ఉపాధ్యాయుడి వేతనాన్ని రెండేళ్లపాటు నిలిపివేసిన ప్రధానోపాధ్యాయుడిపై కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. ఆయన్ను స్కూల్లోకి ప్రవేశించకుండా నెలరోజుల పాటు నిషేధం విధించింది. హెడ్మాస్టర్ స్కూల్లోకి రాకుండా చూసేందుకు ఇద్దరు సాయుధ పోలీసులను పాఠశాల వద్ద ఉంచాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది.
అసలేమైందంటే?
రాజు జానా అనే వ్యక్తి దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గోలాబరిలోని పల్లిమంగల్ పాఠశాలలో 2013 నుంచి ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, 2018 డిసెంబర్ నుంచి 2020 డిసెంబర్ మధ్య ఆయనకు వేతనాన్ని నిలిపివేశారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ సఫీ ఆలం. అయితే, ఈ విషయంపై రాజు కలకత్తా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాఠశాలకు గైర్హాజరు కావడం వల్లే వేతనాన్ని నిలిపివేసినట్లు ఈ సందర్భంగా ఆలం చెప్పుకొచ్చారు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. సమాధానం లేకపోయేసరికి వేతనం ఆపేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మరోవైపు, తన వాదనలు వినిపిస్తూ.. హెడ్మాస్టర్కు స్థానికంగా పలుకుబడి ఉందని రాజు న్యాయస్థానం ముందు పేర్కొన్నారు. కాల్చేస్తానని తనను బెదిరించారని చెప్పారు. వెయ్యి మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయాలని ఒత్తిడి చేసినట్లు వివరించారు. తన హాజరుపట్టికలో వివరాలను వైట్నర్తో మార్చివేశారని ఆరోపించారు.