Sajjala Ramakrishna Reddy Hot Coments on MLA Candidates Quits in YSRCP: పార్టీ గెలుపు కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నవాళ్లు బయటికి వెళ్తుంటారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమన్వయకర్తల మార్పులు, చేర్పులు ఎందుకు చేపట్టామో చెప్పినా వినకుండా వెళ్లేవారిని తాము మాత్రం ఏం చేయగలమన్నారు. అధిష్టానం పిలుపుతో తాడేపల్లికి వచ్చిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ప్రాంతీయ సమన్వయకర్తలు, సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత సీఎంతో భేటీ అయ్యారు. రెండో జాబితాపై సీఎంతో చర్చించామన్న సజ్జల కసరత్తు పూర్తిచేసి త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.
పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ బుధవారం రాత్రి భేటీ అయ్యారు. సమన్వయకర్తల మార్పుచేర్పుల కసరత్తుపై చర్చించారు. సమన్వయకర్తలను మారుస్తున్న చోట కొత్తవారికి, పాతవారికి మధ్య సమన్వయం తేవడంతోపాటు పార్టీ బలోపేతానికి కచ్చితమైన ప్రణాళికను అమలుచేయాలని సూచించారు. వచ్చే మూడు నెలల్లో ప్రభుత్వ పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీలో వన్‌మ్యాన్ షో! అంతా అహం బ్రహ్మాస్మి, తెరపై దింపుడు కళ్లం ప్రయత్నాలు
మార్పులు పూర్తయినచోట కొత్త సమన్వయకర్తల వివరాలను జనవరి ఒకటో తేదీలోగా ప్రకటించి, పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీనికన్నా ముందు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిసి చర్చించారు. వారి పనితీరు గ్రాఫ్, సర్వే నివేదికలు ఎలా ఉన్నాయనే వివరాలను ఎమ్మెల్యేలకు ధనుంజయరెడ్డి అందించినట్లు తెలిసింది. చివరగా కొందరు ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ను కూడా కలిశారు.