Saffron Cultivation In Karnataka : కశ్మీర్‌కే పరిమితమైన కుంకుమ పువ్వును.. ఇప్పుడు కర్ణాటకలోనూ పండిస్తున్నాడు ఓ యువకుడు. ఇంట్లోనే కశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి మరీ.. కుంకుమ పువ్వును పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అలానే మంచి దిగుబడిని సాధించాడు. అతడే దావణగెరెలోని దూడ్డబాతి ప్రాంతానికి చెందిన జాకబ్ సత్యరాజ్.
"నేను కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నాను. అప్పుడే కుంకుమ పువ్వు సాగు చేయాలని ఆలోచన వచ్చింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకముందు పండించిన వారి దగ్గరకు వెళ్లి సమాచారాన్ని సేకరించాను. తర్వాత ఉర్దూ మాట్లాడే నా స్నేహితులను కశ్మీర్‌కు తీసుకెళ్లి అక్కడ కొద్ది రోజుల ఉండి కుంకుమ పువ్వును ఎలా పండించాలో నేర్చుకున్నాను. " అని జాకబ్ సత్యరాజ్ తెలిపాడు.
కుంకుమ పువ్వును సాగు చేయడం కోసం 60 కిలోల విత్తనాలను కశ్మీర్ నుంచి కొనుగోలు చేశాడు జాకబ్. తీసుకొచ్చేటప్పుడే 15 కిలోల విత్తనాలు పాడైపోగా.. మిగిలిన వాటితో సాగు చేశాడు. కుంకుమ పువ్వు సాగు కోసం తన ఇంటిలోనే ఓ గదిలో తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉండేలా ఏసీ పెట్టాడు. గదిలోని చలి బయటకుపోకుండా ఉండటానికి థర్మల్ సీల్‌తో కవర్ చేశాడు. సేంద్రియ ఎరువును, కుంకుమ పువ్వుకు అనూకూలంగా ఉండే మట్టిని తెచ్చి సాగు చేస్తున్నాడు.
విత్తనాలను ఒక ట్రేలో వేసి.. మొలకలు రావటానికి కావల్సిన టెంపరేచర్‌ను రూంలో ఏర్పాటు చేశాడు జాకబ్. మొలకలు వచ్చాక వాటిని తీసి మట్టిలో వేశాడు. కుంకుమ పువ్వు రావడం కోసం వాటికి కావల్సిన ఉష్ణోగ్రతలను సెట్ చేసి పెట్టాడు. పువ్వులు వికసించాక వాటి నుంచి కుంకుమను వేరు చేస్తున్నాడు జాకబ్. అలానే విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తున్నాడు.