పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చారన్న అనుమానంతో ముగ్గరు సాధువులను గ్రామస్థులు దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఆ ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఒకరి తలకు దెబ్బ తగిలింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది ఆ ముగ్గురు సాధువులను గ్రామస్థుల బారి నుంచి రక్షించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని చరోడా బస్తీలో జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం..
భిలాయ్ చరోడా గ్రామానికి బుధవారం ముగ్గురు సాధువులు వచ్చారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆ ముగ్గురు సాధువులు గ్రామంలో తిరుగుతున్నారు. దారిలో ఓ సాధువు ఒక చిన్నారితో మాట్లాడారు. ఇంతలో ఎవరో పిల్లలను ఎత్తకెళ్తున్నారని కేకలు మొదలుపెట్టారు. ఇది విన్న గ్రామస్థులు సాధువులను పిల్లల దొంగలుగా అనుమానించి వారిని పట్టుకుని విచారించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే వారిపై చేయి చేసుకోవడం ప్రారంభించారు.
ఇంతలో మిగతా గ్రామస్థులు అక్కడికి చేరుకుని సాధువులను తీవ్రంగా కొట్టారు. కర్రలతో సైతం దాడికి పాల్పడ్డారు. దాడి తీవ్రతరం అవుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని గాయపడ్డ సాధువులను రక్షించి.. వారి వాంగ్మూలాన్ని తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.