మద్యం తాగి పార్లమెంట్లో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు డ్రగ్స్ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో మాట్లాడిన ఆమె.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తప్పతాగి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. ఆప్‌పై హర్సిమ్రత్ ఈ విమర్శలు చేసిన సమయంలో సభలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నవ్వులు చిందించారు.
'మా సీఎం తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. ఉదయం 11 గంటలకు కూడా..'
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై లోక్‌సభలో సంచలన ఆరోపణలు చేశారు శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్. మద్యం మత్తులో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
"మా సీఎం ఉదయం 11 గంటలకే మద్యం మత్తులో పార్లమెంట్‌కు వచ్చి కూర్చునేవారు. ఆయన పక్కన కూర్చున్న సభ్యులు తమ సీటును మార్చాలని కోరేవారు. ఇప్పుడు ఆయన రాష్ట్రాన్నే నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రే ఇలా ఉంటే.. రాష్ట్రం పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 'తాగి వాహనాలు నడపొద్దు' అనే బోర్డులు మనకు రోడ్లపై కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు వారు 'తాగి రాష్ట్రాన్నే నడిపిస్తున్నారు'."
-హర్సిమ్రత్ కౌర్, శిరోమణి అకాలీదళ్ ఎంపీ
వృత్తిరీత్యా కమెడియన్ అయిన భగవంత్ మాన్.. రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానం నుంచి 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా మాన్ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన ఎక్కువగా మద్యం సేవిస్తారని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. పార్లమెంట్‌కు సైతం మత్తులోనే వచ్చేవారని చెబుతుంటాయి. ఈ విమర్శలపై 2019లోనే కేజ్రీవాల్ బహిరంగంగా స్పందించారు. మాన్ మారిపోయారని.. మద్యం పూర్తిగా మానేశారని ప్రకటించారు.