Sachin Tendulkar National Icon of Election Commission of India 2023 : దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌ను 'నేషనల్ ఐకాన్'గా భారత ఎన్నికల సంఘం- ఈసీ నియమించింది. ఎన్నికల పక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా.. అవగాహన కల్పించేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచిన్, ఎన్నికల సంఘం మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ అగ్రిమెంట్లో భాగంగా.. మూడేళ్ల పాటు ఓటర్లలో అవగాహన కల్పించనున్నారు సచిన్. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం, తెందుల్కర్ సంయుక్తంగా కృషి చేస్తారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటింగ్‌పై నిర్లక్ష్యం వహిస్తున్న వేళ.. వారిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. సచిన్ పేరుప్రఖ్యాతల కారణంగా యువతపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈసీ విశ్వాసంతో ఉంది. 2024 అక్టోబర్-నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా నియమించింది. దీంతో రాబోయే ఎన్నికల పక్రియలో యువత ఎక్కువగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.
ఎన్నికల సంఘం 'నేషనల్ ఐకాన్'గా నియమితులు అయిన తర్వాత సచిన్ తెందుల్కర్ మాట్లాడారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని.. మన ఓటు హక్కును వినియోగించుకోవడం మన ప్రధాన బాధ్యత అని అన్నారు. తన రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ తరఫున బ్యాటింగ్ కొనసాగిస్తానని చెప్పారు.