కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్.. దిల్లీ పర్యటన రాజస్థాన్ రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలకు తెరతీసింది. అధిష్ఠానం ఇచ్చిన హామీలను నెరవేర్చుకొనేందుకే సచిన్ దిల్లీకి వెళ్లారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది జులైలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో విభేదించి తిరుగుబాటు స్వరం వినిపించిన సచిన్‌ను కాంగ్రెస్ పెద్దలు సముదాయించి రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ అగ్ర నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్ఠానం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ సమస్య అపరిష్కృతంగానే మిగిలింది. ఏడాది గడుస్తున్నా సచిన్‌కు ఇచ్చిన హామీలను కూడా అధిష్ఠానం నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రియాంక గాంధీ వాద్రాను కూడా ఆయన కలవనున్నట్టు తెలిసింది.
6-7 మంత్రి పదవులు దక్కాలని..!
కాంగ్రెస్ నుంచి జితిన్ ప్రసాద ఇటీవల భాజపాలోకి వెళ్లిన నేపథ్యంలో రాజస్థాన్‌లో పార్టీ అంతర్గత విభేదాలపై దృష్టి సారించాలంటూ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని.. అందులో సచిన్ అనుచరులకు చోటు దక్కనుందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు సహా బీఎస్పీ నుంచి ఇటీవల వచ్చిన ఎమ్మెల్యేలతో సీఎం అశోక్ గహ్లోత్ నిరంతరం సమాలోచనలు జరుపుతున్నారు. ప్రభుత్వ కేబినెట్‌లో ప్రస్తుతం 9 ఖాళీలుండగా.. సచిన్ వర్గీయులు కాకుండా 18 మంది స్వతంత్రులు కూడా మంత్రి పదవులపై కన్నేశారు. అయితే తన వర్గానికి రాష్ట్ర కేబినెట్‌లో కనీసం 6-7 మంత్రి పదవులు దక్కాలని సచిన్ కోరుతున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సహా పార్టీ, పలు కమిషన్లలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్టు కాంగ్రెస్ రాజస్థాన్ ఇంఛార్జి అజయ్ మాకెన్ శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో తన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు దిల్లీలో అగ్రనేతలతో సచిన్ వరుస సమాలోచనలు జరపడం రాజస్థాన్ కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది.