కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి రాజస్థాన్‌పై పడిందా? ఇటీవల పంజాబ్‌లో నాయకత్వం మార్చినట్లు.. రాజస్థాన్ మంత్రివర్గంలోనూ మార్పులు చేపట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేత సచిన్ పైలట్ (Sachin Pilot News) వారం వ్యవధిలో రెండు సార్లు పార్టీ పెద్దలను కలవడం ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది. తాజాగా శుక్రవారం సాయంత్రం పార్టీ నేతలు రాహుల్ గాంధీ (sachin pilot meets rahul gandhi), ప్రియాంక గాంధీ వాద్రాతో దిల్లీలో పైలట్ సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు సాగాయి. గతంలో తనను ముఖ్యమంత్రి చేస్తారనే హామీని పైలట్(sachin pilot news latest) ఈ సందర్భంగా వారి ముందు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి రాష్ట్రంలో నాయకత్వ మార్పును వాయిదా వేయడానికే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు, ఇదే విషయాన్ని పైలట్‌కు వివరించేందుకు వారు సమావేశమైనట్లు రాజకీయ వర్గాలు అంచనా. ఆయన్ను కాస్త సంతృప్తి పరిచేందుకు.. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన విధేయులను నియమించడానికి మాత్రం అంగీకరించినట్లు సమాచారం.
మరోవైపు ఈ పరిణామాలతో సీఎం అశోక్ గహ్లోత్ వర్గంలో కలవరం మొదలైనట్లు వినికిడి. గతేడాది ఆయనపై అసమ్మతి స్వరం వినిపిస్తూ సచిన్ పైలట్‌తోపాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేత కావడంతో.. పార్టీ అధిష్ఠానం ఆయనతో చర్చలు జరిపి సమస్యను కొలిక్కి తెచ్చింది. తాజాగా పైలట్ మరోసారి రాజకీయంగా పావులు కదుపుతుండటం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార బాధ్యతలను పైలట్‌కు అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, పైలట్ ప్రస్తుతం రాజస్థాన్‌పైనే దృష్టి పెట్టారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.