దేశ స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుండి నడిపిన మహాత్మా గాంధీజీని 'సబర్మతి సాధువు' అని పిలిచేవారు. ఎందుకంటే గాంధీజీ, సబర్మతి నదిది అవినాభావ సంబంధం. ఆయన దక్షిణాఫ్రికా నుంచి రాగానే అహ్మదాబాద్లో ఒక ఆశ్రమం నిర్మించాలని నిర్ణయించారు. అలా 1917లో ఆయన సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పారు. సబర్మతి ఆశ్రమానికంటే ముందు ఆయన కొచ్రాబ్ ఆశ్రమంలో రెండేళ్లు నివసించారు.
"ప్రేమ్ చంద్ భాయి సబర్మతి నది ఒడ్డున ఎకరం పొలాన్ని.. 2 వేల 556 రూపాయల ఖరీదుకట్టి ఇచ్చారు. ముందుగా ఆశ్రమ నిర్మాణం ప్రారంభించారు. కట్టిన వెంటనే కొచ్రాబ్ ఆశ్రమం నుంచి సబర్మతి ఆశ్రమానికి మారిపోయారు."
- డాక్టర్ మాణిక్ భాయి పటేల్, చరిత్రకారుడు
గాంధీజీకి ఈ ఆశ్రమం గురించి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. అది తన సొంతగానే అభివృద్ధి చెందాలని భావించారు. సబర్మతి నది ఒడ్డున ఆశ్రమ నిర్మాణంతో ఆయన ఆకాంక్ష నెరవేరింది. అందుకే బాపూజీకి సబర్మతి ఆశ్రమ ప్రదేశం ఎంతో నచ్చింది.
"గాంధీజీ కూడా చెప్పారు. ఆనాడు ఈ స్థలం ఆశ్రమ నిర్మాణానికి సరిగ్గా సరిపోతుందన్నారు. ఎందుకంటే ఒకవైపు శ్మశానం, మరోవైపు జైలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడికి వచ్చే సత్యాగ్రహి ముందు రెండు మార్గాలుంటాయి. సత్యాగ్రహం చేసి జైలుకెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలి. లేదా సత్యాగ్రహం ద్వారా ప్రాణ త్యాగానికైనా సిద్ధం కావాలి."
- అతుల్ పాండ్య, సంచాలకుడు, గాంధీ ఆశ్రమం
నిరాడంబరత గాంధీజీవన శైలికి మరో పేరు. ఇది గాంధీ ఆశ్రమంలో కూడా కనపడుతుంది. ఇదే సమయంలో ఆశ్రమంలో సమష్టి తత్వం మీద దృష్టి కేంద్రీకరించారు. గాంధీజీ ఆశ్రమంలో హృదయకుంజ్ ఎంతో ముఖ్యభాగం. అది గాంధీజీ నివసించిన స్థలం. ఆయన కుటీరానికి ఈ పేరుపెట్టడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.
"గాంధీజీ అధికారిక నివాసానికి 'హృదయకుంజ్' అని పేరుపెట్టడంలో కేశవ్ కేల్కర్ ఉద్దేశం సుస్పష్టం. ఎందుకంటే ఆశ్రమానికి గాంధీజీ హృదయం లాంటి వారు. అందువల్ల ఆ ప్రదేశానికి హృదయకుంజ్ పేరే ఉండి తీరాలి. హృదయకుంజ్లో మహాత్మునికి ప్రత్యేకమైన పడకగది ఏమీ లేదు. ఆయన చరఖా వడికే ఆ వరండాలోనే నిద్రపోయేవారు."
- అతుల్ పాండ్య, సంచాలకుడు, గాంధీ ఆశ్రమం