Sabarimala news: మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం తెరుచుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్ పరమేశ్వరన్ నంబూదిరి ఆధ్వర్యంలో సాయంత్రం 5గంటలకు ఆలయాన్ని తెరిచారు. కరోనా సంబంధిత ఆంక్షలను ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి మండల పూజ ఇదే కావడం విశేషం.
భక్తులు ఆన్లైన్ లేదా స్పాట్ బుకింగ్ పద్ధతిలో దర్శనానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బుధవారం సుమారు 28 వేల మంది భక్తులు దర్శనానికి రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం ఈ సంఖ్య 50వేలకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 41రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. మధ్యలో విరామం ఇచ్చి డిసెంబర్ 30న మకరవిలక్కు కోసం ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు.
భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పతనంతిట్ట జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక శబరిమల వార్డును అందుబాటులో ఉంచనున్నట్లు కేరళ వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వార్డులో అధునాతన సౌకర్యాలన్నీ ఉంటాయని చెప్పారు. ఔషధాలతో పాటు, ల్యాబ్ పరీక్షలు ఉచితంగానే చేయనున్నట్లు స్పష్టం చేశారు.
తోపులాటలు సహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేరళ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధునాతన సాంకేతికతతో భక్తుల రాకపోకలపై నిఘా ఉంచనున్నారు. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలను అమర్చారు. 13వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తాత్కాలిక పోలీస్ స్టేషన్లను నెలకొల్పారు. ఎన్డీఆర్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వంటి దళాలను సైతం అందుబాటులో ఉంచారు.