Sabarimala Darshan Timings Extended : అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త తెలిపింది. శబరిగిరీశునికి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండడం వల్ల కీలక నిర్ణయం తీసుకుంది. దర్శన సమయాన్ని మరో గంటపాటు పెంచింది. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శించుకుంటుండగా ఇక మధ్యాహ్నాం మూడు గంటల నుంచే దర్శించకోవచ్చని చెప్పింది. దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, బిస్కెట్లు అందిస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు, రోజుకు 75వేల మంది భక్తులనే అనుమతించాలని టీడీబీని అభ్యర్థించినట్లు ఐజీ స్పర్జన్ కుమార్ తెలిపారు. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90,000 బుకింగ్‌లు, స్పాట్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తుల సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. ఈసారి ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు శబరిమలకు తరలివస్తున్నట్లు వెల్లడించారు. ఎంతో ఆధ్యాత్మికంగా భావించే 18 మెట్లను వారు త్వరగా ఎక్కలేకపోతున్నట్లు చెప్పారు.
అయితే క్యూలైన్లలో వేచి ఉంటున్న అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు సరిగా లేవని, నీరు కూడా అందించడం లేదని ప్రతిపక్ష నేత వీడీ సతేస్సన్ ఆరోపించారు. "భక్తుల దర్శనం కోసం 15 నుంచి 20 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. శబరిమలలో తగినంత మంది పోలీసులు మోహరించడం లేదు. యాత్రికుల ఏర్పాట్లకు సంబంధించి కేరళ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడం లేదు. తగిన అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో లేవు" అని సతేస్సన్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకుంటే శబరిమల వద్ద భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవతాయని సత్తేస్సన్ అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరారు.