Ayyappa Temple Closing on December 27 : హరిహర సుతుడు అయ్యప్ప దర్శనం కోసం ఈ ఏడాది భక్తులు ఏ స్థాయిలో పోటెత్తారో తెలిసిందే. ఓ దశలో భక్తులకు ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తులు సైతం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు! మొత్తానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో స్వామి సన్నిధానం కళకళలాడింది. ఎంతగా అంటే.. 5 వారాల్లోనే ఏకంగా 200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉంటే.. అయ్యప్ప స్వామి ఆలయాన్ని డిసెంబర్ 27 నుంచి మూసివేస్తున్నారు! మరి.. ఎందుకు? తిరిగి ఎప్పుడు తెరుస్తారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ముగుస్తున్న మండల పూజ..
అయ్యప్ప మాల వేసిన భక్తులు మండలం (41) రోజులు స్వామి సేవలో తరిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి కేరళ బయలుదేరుతారు. అయితే.. శబరిమల ఆలయంలోనూ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు నేటి(డిసెంబర్ 27)తో ముగియబోతున్నాయి. రాత్రి పూజా కార్యక్రమాల అనంతరం 11 గంటలకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నట్టు ట్రావెన్‌కోర్ బోర్డ్ అధికారులు తెలియజేశారు.
కిక్కిరిసిన ప్రాంగణం..
ఈ ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శబరిమల ఆలయం భారీస్థాయిలో పోటెత్తిందనే చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి మాలధారులు భారీగా అయ్యప్పస్వామి సేవలో పాల్గొన్నారు. ఫలితంగా.. 41 రోజులపాటు అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడిపోయింది. ఎటు చూసినా భక్తజన సందోహంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది.