Sabarimala Aravana Payasam Importance : కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షలు చేపడతారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం నవంబర్, డిసెంబర్, జనవరి.. ఈ మూడు నెలలు మనకు ఎక్కడ చూసిన అయ్యప్ప భక్తులే కనిపిస్తారు. కఠిన నియమ, నిష్ఠలతో 41 రోజుల పాటు మండల దీక్ష చేపడతారు. "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని ధృడసంకల్పంతో మణికంఠుని(Ayyappa Swamy) దీక్ష చేస్తారు.
Sabarimala Prasadam :41 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత.. ఇరుముడి కట్టుకుని శబరిమలలో కొలువై ఉన్న హరిహరసుతుడు మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు. పంబా నదిలో స్నానం చేసి నీలిమలను దాటి శబరిగిరికి చేరుకుంటారు. ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇదిలా ఉంటే శబరిమలలో లభించే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనకు తెలిసిన వారిలో ఎవరైనా శబరి వెళ్తే.. అయ్యప్ప ప్రసాదం కోసం ఎదురుచూస్తాం. మరికొద్ది మంది విడిగా కూడా తెప్పించుకుంటారు. డబ్బాలో ప్యాక్ చేసి పాకంలా నల్లగా ఉండే ఆ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ ప్రసాదం గురించి కొన్ని ఆసక్తికమైన విషయాలున్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- కేరళ పతనంతిట్టా జిల్లా పెరియార్ టైగర్ రిజర్వ్ అభయారణ్యం లోపల వెలసిన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో లభించే ప్రసాదం ఎంతో టేస్టీగా ఉంటుంది.
- తిరుపతి లడ్డూకు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. అయ్యప్పస్వామి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. హరిహరసుతుడు మణికంఠుని దర్శనం అనంతరం స్వాములు తీసుకొచ్చే అయ్యప్ప ప్రసాదం పేరు.. అరవణ ప్రసాదం. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
- స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యాత్ర ముగించుకుని వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదాలు అరవణ పాయసం, అప్పం తప్పకుండా తీసుకుంటారు.
- అరవణ ప్రసాదాన్ని బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. అనేక పోషక పదార్ధాలు మిళితమయిన ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- చలికాలంలో అరవణ ప్రసాదం తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రత సమతాస్థితిలో ఉంటుంది.
- ఇంతటి విశిష్టత గల అరవణ ప్రసాదానికి వాడే బియ్యం మావెల్లిక్కర ట్రావెన్కోర్ దేవస్థానం పరిధిలోని చిట్టి కులంగర దేవి ఆలయం నుంచి సరఫరా అవుతాయి.