కేరళలోని శబరిమల అయప్ప స్వామి క్షేత్రానికి చేరుకోవాలంటే ఏ రైలు ఎక్కాలి? ఇలా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే శబరిమలకు నేరుగా రైలు మార్గం లేదు. ఇప్పుడు ఆ కల సాకారం కానుంది. ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురుచూస్తోన్న శబరిమల రైల్వే ప్రాజెక్ట్‌కు మార్గం సుగమమైంది. సదరు ప్రాజెక్ట్‌కు అయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు కేరళ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత 111 కి.మీ అంగమాలి- శబరిమల ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తికానుంది. ఇందుకు సంబంధించిన నిధులను కేరళ మౌలిక వసతులు, పెట్టుబడి నిధుల బోర్డ్ నుంచి కేటాయించనున్నట్లు కేబినెట్ తెలిపింది.
ప్రాజెక్ట్ వివరాలు
- ప్రాజెక్ట్ అంచనా వ్యయం: రూ.2,815.62 కోట్లు
- రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు: 50 శాతం
- రైల్వే లైను: అంగమాలి- శబరి వయా ఎరుమేలి
ఎప్పుడో కావాల్సింది...
ఈ ప్రాజెక్ట్‌ను 1997-98 రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించారు. రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్ట్ భూమికి రూ.50.76 కోట్లు సహా మొత్తం రూ.517.70 కోట్లు 2006 మే లో కేటాయించింది ప్రభుత్వం.
వెంటనే అంగమాలి- కలాది (7 కిమీ), కలాది-పెరుంబవూర్(10 కిమీ) పనులు మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ప్రాజెక్ట్ కోసం చేపట్టిన భూసేకరణపై స్థానికులు నిరసనలు చేపట్టారు. కోర్టులో కేసులు నమోదయ్యాయి.