తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నౌకలో రష్యా ఇంజినీర్ మృతికి కారణమిదే.. శరీరంపై గాయాలు - ఒడిశా ఇంజినీర్ సెర్గీ న్యూస్

ఒడిశాలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ఇంజినీర్ మృతికి కార్డియాక్ అరెస్టే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు పోస్టుమార్టం నివేదికలో తేలిందని సమాచారం.

Russian engineer Sergy Milyakov
Russian engineer Sergy Milyakov

By

Published : Jan 7, 2023, 4:53 PM IST

ఒడిశాలో అనుమానిత మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల రష్యా ఇంజినీర్ సెర్గీ మిల్యాకోవ్.. ఓ నౌకలో విగతజీవిగా కనిపించారు. అయితే, ఆయన మరణానికి కార్డియాక్ అరెస్ట్​ కారణమని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయం పోస్టుమార్టం పరీక్షల్లో తేలిందని స్పష్టం చేశాయి. ఆయన శరీరంపై స్వల్ప గాయాలు అయ్యాయని, నుదుటిపైనా గాయం కనిపించిందని అధికారులు వెల్లడించారు.

జనవరి 3న ఎంవీ అల్ దనా అనే కార్గో షిప్​లో మిల్యాకోవ్ విగతజీవిగా కనిపించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇనుపఖనిజాన్ని తీసుకెళ్తున్న ఈ నౌక.. బంగ్లాదేశ్​లోని చిట్టాగాంగ్​ పోర్టు నుంచి ముంబయి వెళ్తోంది. ఒడిశా పారాదీప్ తీరంలో ఆ నౌక ఆగింది. లంగరు వేసి ఉన్న సమయంలోనే.. ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

కాగా, ఒడిశాలో ఇటీవల వరుసగా రష్యన్లు చనిపోతున్నారు. గతేడాది డిసెంబర్​లో ఇద్దరు రష్యా టూరిస్టులు ఒడిశాలో అనుమాదాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. పావెల్ ఆంటోవ్ అనే రష్యాకు చెందిన చట్టసభ్యుడు.. హోటల్​ మూడో ఫ్లోర్ నుంచి పడిపోయి మరణించారు. డిసెంబర్​ 24న మరో రష్యా పౌరుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61).. తన హోటల్ గదిలో అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించాడు. ఈ రెండు కేసుల్లో ఒడిశా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

వీరిద్దరి అసహజ మరణాలపై క్రైంబ్రాంచ్‌ చేపడుతున్న విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. వీరిద్దరి పోస్టుమార్టం నివేదికను ఆధారంగా చేసుకొని క్రైంబ్రాంచ్‌ అధికారులు మరో కొత్తకోణంలో దర్యాప్తు చేపట్టారు. బిదెనోవ్‌ మృతదేహంలో గంజాయి వాసనతో కూడిన 100 మి.లీ. ద్రవ పదార్థం ఉన్నట్లు శవపరీక్ష నివేదిక పేర్కొంది. దీంతో ఆ దిశగా అధికారులు విచారణను వేగవంతం చేస్తున్నారు. హోటల్‌లో బస చేసిన రష్యా టూరిస్టులకు గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారు? అన్న కోణంలో హోటల్‌ సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు..

ABOUT THE AUTHOR

...view details