Russia Ukraine war: ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లు, వినతులకు తలొగ్గకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకే రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాలకు సంబంధించిన ఓటింగ్‌లో పాల్గొనకుండా భారత్ దూరంగా ఉంటోంది. మాస్కోతో ఉన్న చిరకాల స్నేహాన్ని చెదరనీయకుండా... శాంతి చర్చలే సమస్యకు పరిష్కారమని సూచిస్తోంది. దౌత్య మార్గాల ద్వారానే ఉక్రెయిన్-రష్యా ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దుకోవాలని హితవు పలుకుతోంది. ఉక్రెయిన్‌పై మాస్కో దండయాత్రకు వ్యతిరేకంగా రష్యా, బెలారస్‌లపై అమెరికా మిత్రపక్షాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనికి సంబంధించి పలుమార్లు ఓటింగ్ నిర్వహించినా భారత్ ఏ వైపు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉంది. అమెరికాతోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ఓటువేయాలని... మాస్కోపై ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేసినా... భారత్ దేశ ప్రయోజనాలకే కట్టుబడి నిర్ణయం తీసుకుంది.
Why India supporting Russia
భారత్‌కు రష్యాతో ఎంతోకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. సైనిక, ఆయుధ, వాణిజ్యంతోపాటు దౌత్య సంబంధాల విషయంలో చాలా ఏళ్లుగా భారత్‌కు రష్యా మంచి మిత్ర దేశంగా ఉంది. భారత్‌కు అతిపెద్ద రక్షణ, ఆయుధ సామగ్రిని సరఫరా చేసే దేశంగా రష్యా నిలిచింది. రష్యా నుంచి ఫైటర్ జెట్లు... జలాంతర్గాములు, 1300పైగా T-90 యుద్ధట్యాంకులను భారత్ కొనుగోలు చేసింది. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి అత్యాధునిక S-400 మిస్సైల్‌లను భారత్ కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి 5 బిలియన్ డాలర్లతో 2018లో ఒప్పందంకుదుర్చుకుంది. దాదాపు 70 శాతం ఆయుధాలను రష్యా నుంచే భారత్ దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం వస్తున్న అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి... రష్యాపై భారత్ ఆంక్షలు విధిస్తే... రక్షణ పరికరాల నిర్వహణ కష్టతరమవుతుంది. ఈ ఆయుధాల నిర్వహణలో స్వదేశీ పరిజ్ఞానం సాధించాలంటే భారత్‌కు దశాబ్దాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ రష్యా విషయంలో అనుసరిస్తున్న తీరు మంచిదేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
US support to India
ప్రస్తుతం ఉక్రెయిన్ విషయంలో భారత్ మద్దతు కోరుతున్న అమెరికా.. ఏ యుద్ధ సమయంలోనూ మనకు అండగా నిలవలేదు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో రష్యా భారత్‌కు సహకారం అందించింది. బంగాళాఖాతంలో ఓవైపు అమెరికాకు చెందిన యుద్ధ నౌక 70 యుద్ధ విమానాలతోను, మరోవైపు అరేబియా సముద్రంలో బ్రిటన్‌కు చెందిన యుద్ధ నౌక భారత్‌ను బెదిరింపులకు గురిచేశాయి. భారత్ విజ్ఞప్తితో ఈ యుద్ధనౌకలు ముందుకు సాగకుండా రష్యా జలాంతర్గాములు అడ్డుకున్నాయి. పశ్చిమ దేశాలు సైతం ఏ యుద్ధంలోనూ భారత్ తరఫున నిలబడిన దాఖలాలు లేవు. పైగా అణ్వస్త్ర పరీక్షలు చేసినప్పుడు ఇవి భారత్‌పై ఆంక్షలు విధించాయి.