Russia Ukraine War: రష్యా ముప్పేటదాడితో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. ఉక్రెయిన్ వాసులతో పాటు, భారతీయులు సైతం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో భారతీయులను సురక్షితంగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
అయితే, విమాన సర్వీసులు అందుబాటులో లేకపోవడం వల్ల ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను లీవూలో ఉంటూ వైద్య విద్య(ఫస్ట్ ఇయర్)ను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థి వంకాయల విష్ణు వర్థన్ స్వయంగా 'ఈనాడు.నెట్'తో పంచుకున్నారు.
"ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందని వార్తలు వస్తున్నప్పటి నుంచి మా కళాశాల నుంచి వెళ్లిపోతామని కోరాం. అందుకు యాజమాన్యం మొదట అంగీకరించలేదు. అయితే, యుద్ధం మొదలైన తర్వాత సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రష్యా సైనిక చర్య ప్రారంభించిన నాటి నుంచే మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. దాదాపు దుకాణాలన్నింటినీ మూసివేశారు. ఆహార పదార్థాలు సమకూర్చుకోవటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నాతో పాటు ఎక్కువమంది మలయాళీలు ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. లీవూ నుంచి పోలాండ్ సరిహద్దుల వరకూ రావాల్సిందిగా ఇండియన్ ఎంబసీ నుంచి మాకు సమాచారం అందించింది. తోటి భారతీయ విద్యార్థులతో కలిసి అందరం పోలాండ్ సరిహద్దులకు బయలుదేరాం"