Russia Ukraine war India response: ఉక్రెయిన్- రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది. భారత్ ఈ అంశంపై తటస్థ వైఖరి అవలంభిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సమస్యకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
మరోవైపు, ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతపై దృష్టి పెట్టామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అత్యవసర సమాచారం కోసం.. 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వివరించింది.
ఉక్రెయిన్‌లోని భారతీయులకు సూచనలు...
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ దేశంలో తీవ్ర అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని.. ఉక్రెయిన్‌లో ప్రజలు తాము ఉన్న స్థలాల్లోనే ఉండాలని సూచించింది. ఇళ్లు, వసతిగృహాలు, శిబిరాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం సూచనలు చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వస్తున్న ప్రజలు వెనక్కి మళ్లాలని పేర్కొంది. రష్యా భాష తెలిసిన రాయబారులను ఉక్రెయిన్‌కు పంపినట్లు తెలిపింది. రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు జారీ చేసే అడ్వైజరీలను పాటించాలని సూచించింది.
విమానాల కోసం పడిగాపులు...
కాగా, ఉక్రెయిన్ విమానాశ్రయంలో పలువురు భారతీయుల స్వదేశానికి వచ్చేందుకు పడిగాపులు కాస్తున్నారు. విమానాశ్రయంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 'కొన్ని గంటలుగా విమానం కోసం ఎదురుచూస్తున్నాం. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఎవరూ స్పందించట్లేదు' అని వాపోయారు. అయితే, ఉక్రెయిన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం ఉద్రిక్తతల నేపథ్యంలో.. మార్గమధ్యలో ఉండగానే దిల్లీకి తిరుగుపయనమైంది.
అయితే, భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇతర దారులను అన్వేషిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, విద్యార్థుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని తేల్చిచెప్పింది.