Russia Ukraine crisis:ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన 'ఆపరేషన్ గంగ'లో భాగంగా... హంగేరీ నుంచి బయలుదేరిన విమానం దిల్లీ చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారికి స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
Evacuation of Indians from Ukraine
బుచారెస్ట్ నుంచి బయలుదేరిన మరో విమానం ద్వారా 182 మంది భారతీయులు స్వదేశాన్ని చేరుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి నారాయణ్ రాణె స్వాగతం పలికారు. బుడాపెస్ట్ నుంచి 216 మందితో ఓ విమానం భారత్‌కు బయల్దేరింది.
భారతీయుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేసేందుకు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు స్లొవేకియాకు వెళ్లారు. స్పైస్‌జెట్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన దిల్లీ నుంచి బయల్దేరారు. రాత్రి 7.50 గంటలకు స్లొవేకియాలోని కోసైస్కు ఈ విమానం చేరుకోనుంది. మార్చి 3న ఉదయం 7.40 గంటలకు విమానం తిరిగి భారత్‌కు రానుంది.
"స్లొవేకియా నుంచి భారత పౌరుల తరలింపు ఆపరేషన్‌ను సమన్వయం చేస్తాం. అక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు వీసాలు వచ్చేలా ప్రయత్నిస్తాం. విద్యార్థులందరినీ సురక్షితంగా భారత్‌కు తీసుకురావడమే మా ప్రథమ లక్ష్యం."
-కిరెన్ రిజిజు, కేంద్ర మంత్రి
పౌరుల తరలింపు కోసం స్పైస్‌జెట్ నడిపిస్తున్న రెండో విమానం ఇది. ఇప్పటికే హంగరీలోని బుడాపెస్ట్‌కు ఓ విమానాన్ని పంపింది స్పైస్‌జెట్. మరిన్ని ఫ్లైట్లను పంపేందుకు అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు 9 వేల మందికి పైగా భారతీయులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.
రాష్ట్రపతితో విదేశాంగ మంత్రి