RTI Application on Chandrayaan 3 and Climate Change : దేశంలో వర్షాలు సరిగ్గా కురవకపోవడానికి.. చంద్రయాన్ 3 ప్రయోగమే కారణమా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు బిహార్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త. ఈ మేరకు సమాధానం చెప్పాలంటూ.. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు ఆర్టీఐ దరఖాస్తు చేశారు. సమాధానం కోసం భగవంతుడి నుంచి సలహా కూడా తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించారు. సరైన సమయంలో వర్షాలు ఎందుకు పడటం లేదని దేవుడ్ని అడగాలి అని చెప్పారు.
చంద్రయాన్ ప్రయోగంలోని లూనార్ మిషన్‌లో కొత్త పరికరాలు అమర్చారని.. అందుకే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించాయన్నారు ఆర్టీఐ కార్యకర్త రాజ్‌కుమార్ ఝా. ఈ సీజన్లో విపరీతమైన వానలు కురవాలని, కానీ వాతావరణం చాలా వేడిగా ఉండి.. వర్షాలే రావడం లేదని దరఖాస్తులో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్న రాజ్‌కుమార్.. అందువల్ల ప్రజలంతా చాలా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
"చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడి దక్షిణధృవంపైల్యాండ్ అయింది. ఇదే వాతావరణాన్ని ట్యాంపరింగ్ చేసినట్లు నేను భావిస్తున్నాను. వాతావరణ పరిస్థితులు ఎందుకిలా మారుతున్నాయి. నాకు ప్రభుత్వం నుంచి సమాధానం కావాలి. అందుకోసం భగవంతుడి నుంచి కూడా ప్రభుత్వం సలహా తీసుకోవచ్చు." అని దరఖాస్తులో తెలిపారు ఆర్టీఐ కార్యకర్త రాజ్‌కుమార్. చంద్రయాన్ 3 మిషన్‌లోని ప్రజ్ఞాన్ రోవర్‌కు స్వర్గం నుంచి సిగ్నల్స్ అందుతాయన్నారు రాజ్‌కుమార్. వాతావరణ పరిస్థితులు ఇలా మారడానికి గల కారణాలను అర్థం చేసుకునేందుకు అది సాయం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన దరఖాస్తు చర్చనీయాంశంగా మారింది.