మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాజ్యసభలోని మహిళా సభ్యులు సోమవారం కీలక డిమాండ్ చేశారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలన్నారు. అప్పుడే అతివలకు తగిన ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొన్నారు.
"మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. అదే విధానం పార్లమెంటు, అసెంబ్లీల్లో అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి."
-ఛాయా వర్మ, కాంగ్రెస్ ఎంపీ
"దేశ జనాభాలో 50 శాతం మంది మహిళలు ఉన్నారు. కాబట్టి పార్లమెంటు, అసెంబ్లీల్లో రిజర్వేషన్లు 33 శాతం కాదు 50 శాతం ఉండాలి."
-ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ
"దేశంలోని 90 శాతం మహిళలకు ఈ రోజు ప్రత్యేకత తెలియదు. వారికి మహిళా దినోత్సవంపై ఎలాంటి అవగాహన లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వం అమలు చేసే పథకాలు అన్నీ ఆ మహిళలకు అందుతాయని ఆశిస్తున్నాను."
-అమీ యజ్నిక్, కాంగ్రెస్ ఎంపీ
"మహిళల సాధికారత కోసం కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టింది. ముమ్మారు తలాక్‌పై చట్టాన్ని తీసుకువచ్చింది. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం వల్ల దేశంలో లింగ నిష్పత్తి మెరుగు పడింది."
-సరోజ్ పాండే, భాజపా ఎంపీ
"లోక్ సభలో 78 మంది, రాజ్యసభలో 27 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో మెరుగైన అవకాశాలు వస్తున్నాయి."
-సంపాతియా ఉకీ, భాజపా ఎంపీ
సరోజ్ పాండే వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ఫులో దేవీ నేతమ్ తిప్పికొట్టారు. బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం అయితే ఉంది కానీ, మహిళలకు మాత్రం ఎక్కడా రక్షణ లేదని ఎద్దేశా చేశారు.
ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజల కోసం పని చేస్తున్న మహిళా ఎంపీల సేవలను కొనియాడారు. మహిళలకు పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి :దీదీకి షాక్- భాజపాలోకి ఐదుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు