Drugs Destroyed NCB : దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) స్వాధీనం చేసుకున్న లక్షా నలభై నాలుగు వేల కిలో డ్రగ్స్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో అధికారులు ధ్వంసం చేశారు. ఈ డ్రగ్స్విలువ మార్కెట్లో రూ.2,378 కోట్లు ఉంటుందని తెలిపారు. 'మాదకద్రవ్యాల అక్రమ రవాణా - జాతీయ భద్రత' అనే అంశంపై దిల్లీలో జరిగిన సదస్సుకు అమిత్ షా సోమవారం హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాదకద్రవ్యాల ధ్వంసాన్ని ఆయన వీక్షించారు.
'డ్రగ్స్‌పై యువతకు సమగ్ర అవగాహన అవసరం'
డ్రగ్స్‌పై యువతకు సమగ్ర అవగాహన కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. డ్రగ్స్ అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టెనెంట్ గవర్నర్లను కోరారు. 'ఈ రోజు మొత్తం 1,44,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం చేశాం. ఈ మాదకద్రవ్యాల విలువ రూ. 2,378 కోట్లు. ఇంతటి ప్రక్రియలో భాగమైన ఎన్సీబీకి ధన్యవాదాలు. 2006-13 మధ్య మొత్తం 1,250 కేసులు నమోదైతే.. 2014-23 మధ్య 3,700 కేసులు నమోదయ్యాయి. గతంలో కంటే భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నాం' అని కేంద్రహోం మంత్రి అమిత్ షా అన్నారు.