రక్షాబంధన్(Raksha Bandhan) రోజు సోదరులకు సోదరీమణులు రాఖీ కడితే.. కానుక ఇవ్వడం ఆనవాయితీ. దేశానికి పీఎం అయినా.. రాష్ట్రానికి సీఎం అయినా.. ఇందుకు అతీతులు కారు! అందుకే రాష్ట్రంలోని బాలికలు, మహిళలను తన అక్కచెళ్లెల్లగా భావించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. వారికి 'లాడ్లీ లక్ష్మీ స్కీమ్' కింద మరో కానుక ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలోని కళాశాలల్లో చేరబోయే విద్యార్థినులకు రూ.20 వేలు చొప్పున నగదు అందజేయనున్నారు. బాలికల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు.
"దేశం సాధికారత సాధించాలంటే.. మహిళా సాధికారత అవసరమని విశ్వసిస్తాను. అమ్మాయిలు కళాశాలలో ప్రవేశిస్తే.. రూ.20,000 నగదు అందజేయాలని నిర్ణయించుకున్నాం. బాలికల ఉన్నత విద్యకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఆర్థిక సాయం కూడా అందిస్తామని భరోసా ఇస్తున్నాను" అని శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట
రాష్ట్ర పోలీసు నియామకంలో 30 శాతం, ఉపాధ్యాయుల నియామకంలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించినట్లు సీఎం శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. మహిళ పేరు మీద ఆస్తి నమోదు చేసినట్లయితే 1 శాతం ఫీజు మాత్రమే ఉంటుందన్నారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు కూడా మహిళలకే కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.