దేశ రాజధానిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. కేజ్రీవాల్ సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. మాస్కు ధరించని వారిపై ప్రస్తుతం రూ. 500గా ఉన్న జరిమానాను రూ. 2 వేలకు పెంచింది. దిల్లీలో కరోనా విజృంభణపై సీఎం అధ్యక్షతన అత్యవసర అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆప్, భాజపా, కాంగ్రెస్ నేతలు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. గురువారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో 80 శాతం పడకలను కొవిడ్ రోగులకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అనంతరం.. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని పార్టీలు ఒక్కటై పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
'' దిల్లీలో ఎక్కువ మంది మాస్కులు ధరిస్తున్నా.. ఎక్కడో చోట కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇకపై ఎవరైనా మాస్కు ధరించకుంటే రూ. 2000 జరిమానా చెల్లించాల్సిందే. మాస్కు ధరిస్తే.. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు. మాస్కులు పంపిణీ చేయాలని.. సామాజిక, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.''
- కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి