Amount returned banks from Mallya: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారం వెల్లడించింది. ఇప్పటివరకు రూ.18వేల కోట్లను ఆయా బ్యాంకులకు బదిలీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఉన్న విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్‌ఏ)కు సంబంధించి ప్రస్తుతం 4700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. మొత్తం రూ.67వేల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన కేసులు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతిఏటా ఈ కేసుల సంఖ్య మారుతుందన్న ఎస్‌జీ.. 2015-16లో 111 కేసులను స్వీకరించగా.. 2020-21లో వీటి సంఖ్య 981కి పెరిగిందన్నారు. ఇక విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛౌక్సీ కేసులకు సంబంధించి మొత్తం రూ.18వేల కోట్లను బ్యాంకులకు అందజేశామని సుప్రీం ధర్మాసనానికి వెల్లడించారు.