తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దళిత బాలికపై హత్యాచారం- రాజకీయంగా దుమారం

దిల్లీలో దళిత చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాడతామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ హామీ ఇవ్వగా.. భాజపా కౌంటర్​ ఇచ్చింది. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లోని ఘటనలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది. మరోవైపు.. బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారు దిల్లీ సీఎం కేజ్రీవాల్​. శాంతిభద్రతల పర్యవేక్షణను పటిష్ఠం చేయాలని కేంద్రాన్ని కోరారు. రాహుల్​ ట్వీట్​పై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్​కు లేఖ రాసింది ఎన్​సీపీసీఆర్​.

minor girl rape
దళిత చిన్నారిపై హత్యాచారం

By

Published : Aug 4, 2021, 3:58 PM IST

Updated : Aug 4, 2021, 8:04 PM IST

దిల్లీ కంటోన్మెంట్​ ప్రాంతంలోని పాత నంగల్​ గ్రామానికి చెందిన దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గ్రామస్థుల మద్దతుతో ఇంటి వద్దే న్యాయపోరాటానికి దిగారు బాధిత కుటుంబీకులు. పలువురు ముఖ్యనేతలు బుధవారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్​, భాజపాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి ఇరుపార్టీలు.

ఏం జరిగింది..?

పాత నంగల్​ గ్రామానికి చెందిన బాధుతురాలి కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తోంది. గత ఆదివారం సాయంత్రం శ్మాశానానికి సమీపంలోని వాటర్​కూలర్​ నుంచి నీళ్లు తెస్తానని తల్లికి చెప్పి వెళ్లిన బాలిక ఎంతకీ తిరిగిరాలేదు. ఆ తర్వాత కాటికాపరి రాధేశ్యామ్​ వచ్చి బాలిక మరణించినట్లు చెప్పాడు. వాటర్​ కూలర్​ నుంచి నీళ్లు పడుతున్న సమయంలో కరెంట్​ షాక్​ తగిలిందని తెలిపాడు. పోలీసులకు విషయం తెలిస్తే.. పోస్ట్​మార్టం పేరుతో ఇబ్బంది పెడతారని, అవయవాలు దొంగతనం చేస్తారని చెప్పి హడావుడిగా బాలిక మృతదేహాన్ని దహనం చేయించాడు. అయితే.. రాధేశ్యామ్​ తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్​ చేశారు. తమ బిడ్డపై కాటికాపరి సహా మరికొందరు అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు. నిందితలను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ తమ ఇంటివద్దే న్యాయపోరాటానికి దిగారు.

నివేదిక కోరిన ఎన్​సీపీసీఆర్​

దళిత బాలిక హత్యాచారంపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది పిల్లల హక్కుల అపెక్స్​ విభాగం ఎన్​సీపీసీఆర్. 'ఈ విషయంలో బాధితుల వివరాలు బయటకు తెలియకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాం. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికతో పాటు అన్ని పత్రాలను 48 గంటల్లో సమర్పించాలి. 'అని ఆగ్నేయ దిల్లీ డిప్యూటీ కమిషనర్​కు లేఖ రాసింది. ​

రూ.10 లక్షల పరిహారం..

అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని కలిసి పరామర్శించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. వారిని కలిసేందుకు ఆ ప్రాంతానికి వెళ్లిన క్రమంలో స్థానికులు సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేరస్థులకు కఠిన శిక్ష పడేలా ఉన్నతస్థాయి న్యాయవాదులను నియమిస్తామని హామీ ఇచ్చారు సీఎం.

కేజ్రీవాల్​ ట్వీట్​

'ఆ బాలిక తిరిగి రాదు. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం దురదృష్టకరం. ప్రభుత్వం వారికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుంది. అలాగే.. న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం. దిల్లీలో శాంతిభద్రతలను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా సరైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నా. కేంద్రానికి మా సాయం అవసరమైతే.. అందుకు సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఘటనలు దేశ రాజధానిలో జరగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశానికి వ్యతిరేకంగా సందేశం వెళుతుంది. ' అని విలేకరులతో అన్నారు కేజ్రీవాల్​.

కఠినంగా శిక్షించాలి..

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు బహుజన సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

అండగా ఉంటాం..

దళిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. " ఆ కుటుంబంతో నేను మాట్లాడాను. వారు కోరుకునేది ఒక్కటే. తమ బిడ్డకు న్యాయం జరగాలని ఆరాటపడుతున్నారు. వారికి మేం అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాడతాం" అని పేర్కొన్నారు రాహుల్​ గాంధీ.

మరి వాటి సంగతేంటి?

దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటనను రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది అధికార భాజపా. రాజస్థాన్​, పంజాబ్​, ఛత్తీస్​గఢ్​ వంటి కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో దళిత బాలికలపై జరిగిన ఘటనలపై ఎప్పుడూ ఒక్క ట్వీట్​, మాట మాట్లాడలేదని విమర్శించారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా. బాధితురాలి తల్లిదండ్రుల ఫొటోలను ట్వీట్​ చేసి పోక్సో, జువనైల్​ చట్టాలను రాహుల్​ గాంధీ ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ విషయాన్ని జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్​ సుమోటోగా తీసుకుని కాంగ్రెస్​ నేతకు నోటీసులు ఇవ్వాలని కోరారు.

రాహుల్​ ఖాతాపై చర్యలు తీసుకోండి..

దిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్యకు సంబంధించి బాధితురాలి కుటుంబీకులతో ఉన్న ఫొటోను షేర్​ చేసిన రాహుల్​ గాంధీ ఖాతాపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్​ను కోరింది పిల్లల హక్కుల విభాగం ఎన్​సీపీసీఆర్​. అది పోక్సో, జువెనైల్​ చట్టాలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్​ రెసిడెంట్​ గ్రీవియెన్స్​ అధికారికి లేఖ రాసింది. బాధితురాలి తల్లిదండ్రులుగా పేర్కొంటూ రాహుల్​ గాంధీ ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేసినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు లేఖలో పేర్కొంది. ఫొటోలో బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అది బాలికను గుర్తించేందుకు వీలు కలిగిస్తోందని తెలిపింది. ట్విట్టర్​ ఖాతాపై చర్యలు తీసుకోవటంతో పాటు ట్వీట్​ను తొలగించాలని కోరినట్లు పేర్కొంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:DOCTOR RAPE ATTEMPT: జ్వరమొచ్చిందని ఆస్పత్రికి వెళితే... అత్యాచారం చేయబోయాడు!

Last Updated : Aug 4, 2021, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details